Fake Covid Certificate Case on Bhargavaram: ఆ కేసులోంచే ఇంకా బయటపడలేదు. మళ్లీ ఇంకో కేసులో ఇరుక్కున్నారు. విచారణకు హాజరు కాకూడదన్న ఆలోచనతో అడ్డంగా బుక్కయ్యారు ఆ బావ, బావమరిది. ల్యాండ్ సెటిల్‌మెంట్ కేసుతో పాటు ఫేక్ సర్టిఫికెట్ల క్రియేట్ చేసిన కేసులో కూడా చిక్కుకున్నారు వాళ్లిద్దరు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై మరో కేసు నమోదయ్యింది. నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులపై మరో కేసు బుక్ చేసారు పోలీసులు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి హఫీజ్‌పేట్ ల్యాండ్ గొడవలో సెటిల్‌మెంట్ కోసం ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేశారు. ఈకేసులో పోలీసులకు దొరికి విచారణ ఎదుర్కొంటున్న టైమ్‌లో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఈనెల 3న కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా తాము హాజరుకాలేమని ఈనెల 1న కోవిడ్ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే భూమా ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుకు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్‌ని బోయినపల్లి పోలీసులు పరిశీలించారు. వారికి కోవిడ్ వచ్చినట్లుగా ధృవీకరించిన ఆసుపత్రికి వెళ్లి విచారించడంతో వాస్తవం బయటపడింది. భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీగా తేల్చారు పోలీసులు. దీంతో బావ, బావమరదితో పాటు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది వినయ్, రత్నాకర్, శ్రీదేవిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మొదటి కేసులోనే కొంతకాలం పోలీసులకు చిక్కకుండా పారిపోయి..ఆ తర్వాత బెయిల్‌పై బయటకివచ్చారు ఈ ఇద్దరు. మరి ఇప్పుడు ఏకంగా విచారణకు హాజరుకాకుండా ఉందామన్న వీళ్ల ప్లాన్‌పై అధికారులు ఎలాంటి చెక్ పెడతారో చూడాలి.