తమిళనాడులోని శివకాశీ సమీపంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. కూలీలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు సంఘటన జరిగిన వెంటనే.. ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నాడు. సత్తూరు నగర్ పోలీసులు అతని గురించి గాలిస్తున్నారు.