Doctor kills wife : తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. భార్యను గొంతుకోసి చంపేసిన ఓ ప్రబుద్ధుడు.. పారిపోతూ ప్రమాదానికి గురయ్యాడు. కోయంబత్తూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంచీపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హెచ్ఆర్‌గా పనిచేస్తున్న కీర్తన (28), పొథేరి సమపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోకుల్ కుమార్(35) వివాహం జరిగింది.
కీర్తన, గోకుల్ కుమార్‌ల కాపురం మధురాంతకం సమీపంలోని ఆనంద్‌నగర్‌లో పెట్టారు. అయితే, కీర్తన తనతోపాటు తన తల్లిదండ్రులను కూడా వెంట తెచ్చుకుంది. లాక్‌డౌన్ తర్వాత గోకుల్ ఆసుపత్రికి వెళ్లడం మానేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఇదిలావుంటే, భార్యాభర్తలు. కీర్తన పెద్ద చెల్లెలు, గోకుల్ పెద్ద తమ్ముడు మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కాగా, శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో దంపతులిద్దరూ మరోసారి గొడవపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన గోకుల్ వంటింట్లోకి వెళ్లి కత్తి తెచ్చి కీర్తన గొంతు కోసి హతమార్చాడు. వెంటనే అప్రమత్తమైన కీర్తన తండ్రి మురహరి కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించాడు. ఇదే క్రమంలో గోకుల్ ఆయనపైనా కూడా దాడి చేశాడు. కీర్తన గొంతు కోసిన తర్వాత ఆమె జుట్టు పట్టుకుని ఇంటి బయటకు లాక్కొచ్చాడు. కారును ఆమె పైనుంచి పోనిచ్చాడు. అది చూసి ఇరుగుపొరుగువారు రావడంతో గోకుల్ ఆమెను అక్కడే వదిలేసి కారులో పరారయ్యాడు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కీర్తన, ఆమె తండ్రిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కీర్తన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన మురహరిని కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఇదిలావుంటే, భార్యను చంపి కారులో పారిపోతున్న గోకుల్ చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై నుంచి వెళ్తుండగా అతడి కారు అదుపు తప్పి అర్థూర్ టోల్‌బూత్ వద్ద బోల్తాపడింది. సమాచారం అందుకున్న అచరపక్కమ్ పోలీసులు గోకుల్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మధురాంతకం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండిః పరీక్ష రాసేందుకు వెళ్లింది.. ప్రియుడిని పెళ్లాడి వచ్చింది.. ఇరు కుటుంబాలు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!