2016 లో బులంద్‌షహర్‌లో ఒక రహదారిపై తల్లి-కుమార్తెపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సలీం బవేరియా ప్రభుత్వ ఆసుపత్రిలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో ఆదివారం మరణించాడు. ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ).. సలీంతో పాటు, మరో ఇద్దరు వ్యక్తులపై మూడేళ్ల క్రితం చార్జిషీట్ దాఖలు చేసింది. బవేరియాను బులంద్‌షహర్‌లోని జిల్లా జైలులో ఉంచారు.
పోలీస్ సూపరింటెండెంట్ అతుల్ కుమార్ శ్రీవాస్తవ కథనం ప్రకారం.. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న బవేరియా ఇటీవల ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, అధికారులు బులాండ్‌షహర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే అతడు మృతి చెందాడు.
జూలై 2016 లో బవేరియా ముఠా ఢిల్లీ-కాన్పూర్ హైవేపై కారులో ప్రయాణిస్తోన్న ఒక కుటుంబాన్ని అడ్డుకుని.. 13 ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబంలోని మగ సభ్యులందరినీ..తాళ్లతో కట్టివేసి ఈ దుశ్చర్యను సాగించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బవేరియా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు సిబిఐకి బదిలీ అయ్యింది. ప్రస్తుతం సలీం చనిపోగా.. జుబైర్, సాజిద్‌లు బులంద్‌షహర్ జైలులో ఉన్నారు.