Araku Road Accident : మాటలకందని విషాదం… ఒకే కుటుంబంలో జరిగిన పెను ప్రమాదం.. అసలేం జరిగింది..!

Araku Road Accident: కాలం కలిసి రాలేదు. ప్రయాణంలో అపశృతి వారి జీవితాలనే తలకిందులు చేసింది. అరకు కలయతిరిగి.. సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లాల్సిన ఆ కుటుంబం..

Araku Road Accident : మాటలకందని విషాదం... ఒకే కుటుంబంలో జరిగిన పెను ప్రమాదం.. అసలేం జరిగింది..!

Updated on: Feb 13, 2021 | 9:53 AM

Big Tragedy : మాటలకందని విషాదం… ఒకే కుటుంబంలో జరిగిన పెను ప్రమాదం. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు సందర్శించుకుని ఆదివారంలోగా ఇంటికి చేరుకోవాలన్న ఆలోచన. కాని కాలం కలిసి రాలేదు. ప్రయాణంలో అపశృతి వారి జీవితాలనే తలకిందులు చేసింది.

అరకు కలయతిరిగి.. సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లాల్సిన ఆ కుటుంబం.. మధ్యలోనే ప్రమాదానికి గురైంది. అరకులోయ నుంచి వెనుదిరుగుతున్న సమయంలో బ్రేకులు ఫెయిలై.. లోయలోకి దూసుకుపోయింది బస్సు.

హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన కొట్టం సత్యనారాయణ కుటుంబం ఈనెల 10న దినేష్‌ ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సులో బయల్దేరారు. విజయవాడ, అమరావతి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, చివరికి భద్రాచలం దేవాలయాలను దర్శించుకుని ఆదివారం కల్లా ఇంటికి చేరుకోవాలనేది వారి ప్లాన్‌. అప్పటికే విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించుకున్నారు.

గురువారం రాత్రి సింహాచలం వసతిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం అరకు వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపారు. బొర్రా గుహలను సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి ఏడింటికి బొర్రా, టైడాకు మధ్యన మలుపు వద్ద బస్సు లోయలో పడింది.

సుమారు 80 అడుగుల లోతులో బస్సు పల్టీలు కొడుతూ పడడంతో.. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో కొట్టం సత్యనారాయణ, సరిత, లత.. చిన్నారి శ్రీనిత్య ఉన్నారు. అయితే మొత్తం 22మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9మంది పరిస్థితి విషమంగా ఉంది.

అరకులోయ నుంచి తిరిగి వస్తున్నప్పుడే బస్సు బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్‌ శ్రీశైలం గుర్తించాడు. బస్సులోని వారికి తెలపడంతో వారు కేకలు వేశారు. అప్పటికే ఘాట్‌ రోడ్డు దిగువకు వస్తుండడంతో బస్సును నియంత్రించడం కష్టమైంది. అయిదో నంబర్‌ మలుపు వచ్చేసరికి నియంత్రణ సాధ్యంకాక నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను విజయనగరం జిల్లా ఎస్‌కోట తరలించారు. అక్కడి ప్రాథమిక చికిత్స అందించి వైజాగ్‌ కేజీహెచ్‌కు తరలించారు.

అప్పటికే ఎస్‌కోటకు జిల్లా ఎస్పీ, డీఐజీ చేరుకున్నారు. ఎస్‌కోటకు చేరుకునే సరికే.. క్షతగాత్రుల శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. పదేళ్లు కూడా నిండని చిన్నారులు కూడా గాయాలపాలవడం అక్కడివారిని కంటతడిపెట్టించింది. ముఖ్యంగా చిన్నారి శ్రీనిత్యని చూడాలంటూ తల్లి మౌనిక అక్కడివారిని అడగడం చూసినవారిని కంటతడిపెట్టించింది.

ఇక ప్రమాదానికి కారణం బ్రేకులు ఫెయిల్‌ అవ్వడమే అంటున్నాడు డ్రైవర్‌ శ్రీశైలం. తాను ఘాట్‌రోడ్లలో పదేళ్ల నుంచి నడుపుతున్నానని అంటున్నాడు. బ్రేకులు ఫెయిల్‌ అవ్వడం.. ఆ సమయంలో రిటర్న్‌ జర్నీలో ఉండడంతో.. బస్సు అదుపుకాక లోయలోకి దూసుకెళ్లిందని అంటున్నాడు.

మరోవైపు బస్సులోని ప్రయాణికులు మాత్రం డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమవారి క్షమ సమాచారం తెలియక ఇక్కడ బంధువులు తల్లడిల్లిపోతున్నారు. అంతా పక్కాగా ప్లాన్‌ చేసుకున్నారని.. అయితే టూర్‌ మొదలైనప్పటి నుంచీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగానే వ్యవహరించాడని వారు ఫోన్‌లో చెప్పారంటున్నారు.

ఇక బాధితులకు అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌. ఇక్కడి నుంచి అధికారులను విశాఖకు పంపుతున్నామన్నారు. వారు అక్కడ పరిస్థితిని సమీక్షించి నివేదిక అందజేస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులను ఆదుకునే పూచీ నాది అన్నారు మాగంటి. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు మున్నూరుకాపు సంఘం నాయకులు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ఇవి కూడా చదవండి

AP Panchayat Elections 2021 live : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం… 2,786 సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌..

AP Panchayat Elections 2021 : పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారా..? అయితే ఇలా చేయండి..!