Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్ కేసు విచారణ వేగవంతం.. మరో పోలీసు అధికారిపై బదిలీ వేటు!

|

Jun 29, 2021 | 9:37 PM

అంబడిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించడం తెలంగాణలో పెద్ద దుమారమే లేపింది.

Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్ కేసు విచారణ వేగవంతం.. మరో పోలీసు అధికారిపై బదిలీ వేటు!
Mariamma Lockup Death Case
Follow us on

Mariamma Lockup Death Case: అంబడిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించడం తెలంగాణలో పెద్ద దుమారమే లేపింది. దళిత సంఘాలు, విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి స్వయంగా ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. గతంలోని ఇలాంటి సందర్భాలకు భిన్నంగా ఉదారంగా నష్టపరిహారం ప్రకటించారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో లాకప్‌ డెత్ ఘటనకు సంబంధించి మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. చింతకాణి ఎస్‌ఐ రెడ్డబోయిన ఉమను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు ఎటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఖమ్మంలో పర్యటించి మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి.. చింతకాని పోలీసు స్టేషన్‌లో జరిగిన వివరాలపై ఆరా తీశారు.

డీజీపీ పర్యటన అనంతరం చింతకాని ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మరి కొంతమంది పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరియమ్మ లాకప్‌ డెత్ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్‌, ఆయన స్నేహితుడు శంకర్ ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు ఫిర్యాదు రావడంతో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారించారు. వారిద్దరి వాంగ్మూలం ప్రకారం మరియమ్మను కూడా పోలీసులు తరువాత అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 18న ఉదయం 7.45 గంటలకు మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్, ఆయన స్నేహితుడు శంకర్‌లను స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణ పూర్తి చేశారు. విచారణలో వెంటనే వారు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి దొంగతనం అయిన సొమ్ము రికవరీ చేశారు. అయితే, మరుసటిరోజు పోలీసు స్టేషన్‌లో మరియమ్మ స్పృహ తప్పింది. వెంటనే ఆమెను భువనగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదిలావుంటే, ”పోలీసులు నన్ను, మా అమ్మను ఘోరంగా కొట్టారు. వారు గట్టిగా కొట్టడంతోనే మేం నేరం చేయకపోయినా చేసినట్లు ఒప్పుకున్నాం. పోలీసులు కొట్టిన దెబ్బలతో మా అమ్మ నా ఒళ్లోనే పడిపోయింది. అక్కడే చనిపోయింది” అని మరియమ్మ కుమారుడు ఉదయ్ బీబీసీకి చెప్పారు. తనను, తల్లిని అడ్డగూడూరు పోలీసులు, చింతకాని స్టేషన్‌లో పెట్టి కొట్టారని ఉదయ్ చెప్పారు.

కాగా, మరియమ్మ మరణవార్త తెలుసుకున్న దళిత నాయకులు, విపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరియమ్మది లాకప్ డెత్ అని సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పటికప్పుడు ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు రాచకొండ కమిషనర్. మల్కాజ్ గిరి ఏసీపీని విచారణ అధికారిగా నియమించారు. తాజాగా చింతకాణి ఎస్‌ఐ ఉమను బదిలీ చేస్తూ జిల్లా పోలీసు ఉన్నతాదికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలావుంటే, గతంలో తెలంగాణలో జరిగిన లాకప్ డెత్‌లకు భిన్నంగా ఈ కేసులో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు.

Read Also… AP High Court: హైకోర్టులో ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై విచారణ.. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించిన కోర్టు