Telangana: సోషల్ మీడియా వేధింపులకు పదో తరగతి విద్యార్థిని బలి.. ఐ వాంట్‌ జస్టిస్‌ అంటూ..

|

Jun 02, 2022 | 3:47 PM

సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోన్న అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది ఆదిలాబాద్‌లో జరిగిన ఓ ఘటన. సామాజిక మాధ్యమాల్లో పోకిరీగాళ్ళ వికృత చేష్టలకు బలైన పద్నాలుగేళ్ళ పసిబిడ్డ సాక్షి ఇచ్చిన నినాదం ఇప్పుడు రణనినాదంగా మారి ఈ సమాజంపై సవాలక్ష సవాళ్ళను సంధిస్తోంది.

Telangana: సోషల్ మీడియా వేధింపులకు పదో తరగతి విద్యార్థిని బలి.. ఐ వాంట్‌ జస్టిస్‌ అంటూ..
Girl Commits Suicide
Follow us on

10th Class Girl commits suicide : నగరాల్లోనో, పట్టణాల్లోనో కాదు. పల్లెల్లోనూ సోషల్‌ మీడియా వేధింపుల పరంపరం మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఆడపిల్లల జీవితాల్లో బడబాగ్నులు సృష్టిస్తోంది. అన్నెం పున్నెం ఎరుగని అమాయక అడవిబిడ్డల్లో అల్లకల్లోలం రేపుతోంది. ఇంటా, బయటా వేధింపులు అమ్మాయిలకు ఈ సమాజంలో నిలువ నీడలేకుండా చేస్తున్నాయి. విరిసీ విరియకుండానే చిన్నారులను మొగ్గలోనే తుంచేస్తున్నాయి. జులాయిల వేషాలు పల్లెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆడపిల్లల పట్ల వేధింపులకు పట్టణమా, పల్లెటూరా అన్న తేడాలేని స్థితి ఆందోళన కలిగిస్తోంది. పోకిరీగాళ్ళ అరాచకాలకు ఇప్పుడు పల్లెలు కూడా మినహాయింపు కాదన్నది మరోమారు రుజువయ్యింది. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోన్న అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది ఆదిలాబాద్‌లో జరిగిన ఓ ఘటన. సామాజిక మాధ్యమాల్లో పోకిరీగాళ్ళ వికృత చేష్టలకు బలైన పద్నాలుగేళ్ళ పసిబిడ్డ సాక్షి ఇచ్చిన నినాదం ఇప్పుడు రణనినాదంగా మారి ఈ సమాజంపై సవాలక్ష సవాళ్ళను సంధిస్తోంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఇన్ స్ట్రాగ్రాంలో పోకిరీల వేధింపులకు 10వ తరగతి విద్యార్థిని ముస్లే సాక్షి (16) బలయ్యింది. నకిలీ ఐడీలు సృష్టించి అసభ్యకరమైన సందేశాలు పంపించడంతో ఆ చిన్నారి నిండు నూరేళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. ఆ బాలిక ఆఖరి శ్వాస వీడుతూ ఈ సమాజంపై ఓ రణనినాదాన్ని రాసింది. ఐ వాంట్‌ జస్టిస్‌.. అంటూ సందేశాన్ని రాసి చివరి శ్వాస వీడిన ఈ చిన్నారి ఘటన యావత్‌ సమాజాన్ని కుదిపేస్తోంది. పోకిరిగాళ్లు.. తన బిడ్డను బలిగొన్నారని బాధితురాలి తండ్రి, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

తన పేరు మీద నకిలీ ఐడీలు సృష్టించి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తుండటంతో.. రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ముస్లే సాక్షి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఐ వాంట్ జస్టీస్ అంటూ.. తన పేరు మీద నకిలీ ఐడి తయారు చేసిన వారిని గుర్తించి శిక్షించాలని సూసైడ్ నోట్ లో బాలిక రాసింది. కుటుంబీకులు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..