అరగంటలోనే కొవిడ్ ఫలితం.. సొంతంగా కొవిడ్ టెస్టింగ్ కిట్.. ఆమోదం తెలిపిన అమెరికా సర్కార్..

|

Nov 18, 2020 | 3:45 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణతో జనం అల్లాడిపోతున్నారు. కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

అరగంటలోనే కొవిడ్ ఫలితం.. సొంతంగా కొవిడ్ టెస్టింగ్ కిట్.. ఆమోదం తెలిపిన అమెరికా సర్కార్..
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణతో జనం అల్లాడిపోతున్నారు. కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే కొద్ది పాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోవల్సి వస్తుంది. దీంతో గంటల తరబడి క్యూ లైన్ నిరీక్షించి పరీక్షలు చేయించుకోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే సొంతంగా కొవిడ్ టెస్ట్ చేసుకునే పరికరానికి అమెరికా ఆమోదం తెలిపింది.

కొవిడ్-19 పరీక్ష చేయించుకునేందుకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ పరీక్షచేసుకునే టెస్టింగ్ కిట్‌కు అమెరికా ప్రభుత్వం అనుమతినిచ్చింది. లుసిరా హెల్త్ కంపెనీకి చెందిన ఆల్-ఇన్-వన్ టెస్ట్ కిట్‌ అత్యవసర వినియోగ అధికారాన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) జారీ చేసింది. అయితే, లుసిరా టెస్ట్‌ను ప్రస్తుతానికి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని ఎఫ్‌డీఏ పేర్కొంది. అదే విధంగా హెల్త్‌కేర్ ప్రొవైడర్లు ఈ టెస్ట్‌లకు సంబంధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని ఎఫ్‌డీఏ తెలిపింది.

కాగా.. లుసిరా టెస్ట్ శ్వాబ్ శాంపిల్‌ను చిన్న సీసాలో పెట్టి టెస్ట్ యూనిట్‌లో ఉంచుతారు. టెస్ట్ యూనిట్‌‌లోని లైట్-అప్ డిస్ ఫ్లే ఆధారంగా ఫలితాలను నేరుగా తెలుసుకునేందుకు వీలవుతుంది. లుసిరా టెస్ట్ కిట్‌ను ఇంట్లోనే కాకుండా, క్లినిక్, ఆసుపత్రులలో, ఎమర్జెన్సీ రూంలలో కూడా ఉపయోగించుకునేలా ఎఫ్‌డీఏ అనుమతులను జారీ చేసింది.

ఇంటి నుంచే కొవిడ్-19 పరీక్ష చేసుకునే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ.. లుసిరా టెస్ట్ కిట్ పూర్తిగా స్వీయ-నిర్వహణతో కూడుకుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇతరులతో సంబంధం లేకుండానే ఎవరికి వారు కొవిడ్ పరీక్ష చేసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా టెస్ట్‌ల ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. లుసిరా టెస్ట్ ఫలితం మాత్రం అరగంటలోపే వచ్చేస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోందని.. ఇటువంటి సమయంలో లుసిరి టెస్టింగ్ కిట్ అనేది ముఖ్యమైన రోగనిర్థారణ పురోగతి అని ఎఫ్‌డీఏ కమిషనర్ స్టీఫెన్ హాన్ ఓ ప్రకటనలో తెలిపారు.