UK Omicron: కరోనా మహమ్మారి గ్రేట్ బ్రిటన్ ను ఓ రేంజ్ లో వణికిస్తోంది. గత 24గంటల్లో 78,610 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇవే ఇప్పటివరకు దేశంలో అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య. కరోనా వైరస్ .. డెల్టా వేరియంట్‌తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ లో ఇంత భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. జనవరి 8న నమోదైన 68,053 కేసులో ఇప్పటి వరకూ అత్యధికం. రోజుకో రకంగా వైరస్ మార్పు తీసుకోవడంతో అక్కడ ప్రభుత్వం త్వరితగతిన టీకాలు వేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ రోజురోజుకి ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. రెండు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదు కానున్నాయని హెచ్చరించారు. అయితే కోవిడ్-19 బూస్టర్ డోస్ పనిచేస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓమిక్రాన్ ముప్పును నివారించడానికి ఈ ఏడాది చివరి నాటికి వృద్ధులకు బూస్టర్ డోస్ ఇవ్వాలని జాన్సన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి:
ఒమిక్రాన్ వేరియంట్‌ల సంఖ్య ప్రతి రెండు మూడు రోజులకు రెట్టింపు అవుతోందని UK ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. మరోవైపు, బుధవారం నుండి దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన సొంత పార్టీ నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇంగ్లండ్‌లో ఇప్పుడు నైట్‌క్లబ్‌లు, స్పోర్టింగ్ మ్యాచ్‌ల సహా ఇతర ఈవెంట్స్ కు హాజరు కావాలంటే.. డబుల్ వ్యాక్సినేషన్ వేసుకున్న ‘కోవిడ్ పాస్’ అని పిలవబడే సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది.
ఎంపీలు వ్యతిరేకంగా ఓటు:
99 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. మంగళవారం రాత్రి పార్లమెంటు కరోనా సరికొత్త నిబంధనలను ఆమోదించింది. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనలకు మద్దతిస్తామని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటికే చెప్పింది. బుధవారం నుండి అటువంటి ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి టీకా సర్టిఫికేట్ లేదా గత 48 గంటల్లో RT PCR తప్పనిసరి చేశారు.
Also Read: పిల్లల భవిష్యత్ తల్లిదండ్రుల అలవాట్లపైనే అంటున్న చాణుక్యుడు.. వీటిని విస్మరించవద్దు అంటూ సూచన