Telangana covid-19 second wave precautions : తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు సరికదా.. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు కేసులు రెండు వేలకు చేరువలో నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితులపై అలర్ట్ అయిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటిండెంట్‌లతో ప్రత్యేక సమీక్ష జరిపారు.
కరోనాకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు.. ఇక, ముందు ముందు ఎలాంటి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయ్యాలన్న దానిపై చర్చించారు. సెకండ్ వేవ్‌లో వైరస్ స్పీడ్‌గా వ్యాపిస్తుండడంతో.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో కోవిడ్ వార్డులు లేకపోతే.. వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వార్డులను ఏర్పాటు చేయడమే కాకుండా.. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించే విధంగా వసతులను ఏర్పాటు చేయాలని వైద్యులను కోరారు.
అన్ని హాస్పిటల్స్‌లో ఐసీయూలతో పాటు.. ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం, అజాగ్రత్త వహించకూడదని హెచ్చరించారు. ప్రతి రోజు వైద్యులు, రోగులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. గతంలో ఎలాంటి వైద్య సేవలు అందించి.. కరోనాను తరిమి కొట్టామో.. ఇప్పుడు కూడా రెట్టించిన ఉత్సాహంతో కరోనాను కట్టడి చేయాలని కోరారు. ఎవరైనా రోగులు ఆస్పత్రికి రాని పక్షంలో ఇతర సిబ్బందిని పంపించి చికిత్సలు అందించాలని కూడా చెప్పారు.
ఇక ఆన్‌లైన్‌లో కూడా వైద్య సేవలు అందించేందుకు సిద్ధం కావాలని మంత్రి ఈటల కోరారు. అన్ని ఆస్పత్రుల్లో ఎక్కడా బెడ్స్ లేవన్న మాట రావొద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఏ స్థాయిలో విస్తరించినా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసుకోవాలని మంత్రి వైద్య ఉన్నతాధికారుల్ని కోరారు. రోగుల సంఖ్య ఎంత పెరిగినా.. అన్నింటికి సిద్ధంగా ఉండాలని.. అవసరమైతే హోటల్స్, ప్రైవేటు బిల్డింగ్స్ అద్దెకు తీసుకునే విధంగా చర్చలు చేపట్టాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి కోరారు.