తెలంగాణలో భారీగా పెరుగుతున్న రికవరీలు

|

May 19, 2020 | 1:39 PM

ఇటు తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా..అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

తెలంగాణలో భారీగా పెరుగుతున్న రికవరీలు
Follow us on

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను కరోనా రక్కసి వణికిస్తోంది. గత రెండు నెలలుగా దేశంలో వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్ కోరల్లో చిక్కుకుని పలు రాష్ట్రాలు హడలెత్తిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల వరకు ఎవ్వరినీ విడిచి పెట్టటం లేదు కరోనా. ఇప్పటికే దేశంలో మొత్తం కేసుల సంఖ్య లక్షదాటేసింది.

అయితే, మరో ఆసక్తికర విషయం ఎంటంటే..పాజిటివ్ కేసులకు సమాంతరంగా రికవరీలు కూడా భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. మన దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య లక్ష దాటింది. మొత్తం 1,01,139 మంది కరోనా బారినపడగా అందులో 39,173 మంది కరోనాపై విజయం సాధించి డిశ్చార్జ్ అయ్యారు. అంటే రికవరీ రేటు సుమారు 40 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు సైతం తక్కువగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,163 మంది కరోనాతో చనిపోయారు. అంటే మరణాల రేటు 3 శాతం మాత్రమే. మరణాల రేటు తక్కువగా, రీకవరీ రేటు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు.

ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా..అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారిలో 62.03శాతం మంది అంటే 1,002 మంది కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ఇలా కరోనా నుండి కోలుకున్న వారిలో ఎక్కువ శాతం మంది 21 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వారు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.