New variants of covid 19 : బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో వెలుగుచూసిన మ్యుటేషన్ చెందిన కరోనా కొత్తరకాలు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్తరకం కరోనా కేసులు భారత్‌లోనూ వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ వైరస్‌కు సంబంధించి ఒక కేసు నమోదు కాగా, దక్షిణాఫ్రికా రకం కేసులు నాలుగు నిర్ధారణ అయినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. వైరస్ నిర్ధారణ అయిన వారితోపాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇక, బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ కేసులు విజృంభణ కొనసాగుతుంది. బ్రిటన్ నుంచి భారత్‌కు రాకపోకలు పెరగడంతో ఇక్కడ కూడా భారీగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 187మంది రోగుల్లో బ్రిటన్ రకం కరోనా నిర్ధారణ అయినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే, వీరిలో ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తాజాగా భారత్‌లో వెలుగుచూసిన దక్షిణాఫ్రికా రకం వైరస్ ఇప్పటికే 44దేశాల్లో విస్తరించగా, బ్రెజిల్ రకం మాత్రం ఇప్పటివరకు 15దేశాల్లో గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. మరోవైపు, బ్రిటన్ రకం కొత్త వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం భారతీయ వ్యాక్సిన్లు ఉన్నట్లు భావిస్తున్నామని బలరాం భార్గవ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం వైరస్‌లు భిన్నంగా ఉన్నందున వీటిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు.
In India, the South African strain of COVID19 has been detected in 4 returnees from South Africa. All travellers and their contacts tested and quarantined: Dr. Balram Bhargava, DG ICMR https://t.co/SziCGy91ws
— NEWS9 (@NEWS9TWEETS) February 16, 2021
ఇదిలా ఉంటే, బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో వెలుగుచూసిన మ్యుటేషన్ చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి. బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ ఇప్పటికే 80 దేశాలకు పైగా పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే వెల్లడించింది. సాధారణ రకం కంటే దాదాపు 30 నుంచి 70శాతం వేగంతో వ్యాప్తిచెందడమే కాకుండా బ్రిటన్‌లో కొవిడ్ మరణాలు పెరగడానికి ఈ రకం కారణమని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, భారత్‌లో మాత్రం వీటి ప్రభావం తక్కువగానే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇప్పటివరకు 87,40,595 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వారిలో 85,69,917 మంది మొదటి డోసు, 1,70,678 మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. అలాగే 14 రాష్ట్రాలు 70 శాతం మందికి పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేసినట్లు తెలిపారు. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో 42 శాతం మంది వైద్య సిబ్బందికి మాత్రమే టీకాలు వేసినట్లు తెలిపారు. పది రాష్ట్రాలు కేవలం పది శాతం మంది సిబ్బందికే టీకాలు పంపిణీ చేశాయని పేర్కొన్నారు.
ఇక, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో వెలుగుచూస్తున్న కొత్త కేసులు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే మరోసారి అత్యధిక కేసు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో 61,550, మహారాష్ట్రలో 37,383 క్రియాశీల కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 72 శాతమని రాజేశ్ వెల్లడించారు. కొత్త రకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడు రోజులుగా ప్రతి పదిలక్షల మందిలో 56 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల వ్యవధిలో 9,121 మంది కరోనా బారిన పడగా..81 మంది ప్రాణాలను కోల్పోయారు.
Read Also… ఏపీలో మరోసారి కరోనా కలవరం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు