కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్ల మీదికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని భావించారు. రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. సమాజానికి ఇబ్బంది కలిగిస్తే… అన్ని లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. మాట వినకపోతే… తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల కర్ఫ్యూ తప్పదని హెచ్చరించారు. అది వినకపోతే.. ఆర్మీని రంగంలోకి దింపక తప్పదని.. షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇస్తామన్నారు. దీంతో పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు… తమ పాస్ పోర్టులు కలెక్టర్ ఆఫీసులో ఉంచాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.