దేశంలో కరోనా పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుర్‌గావ్‌లోని ఓ పేటిఎం ఉద్యోగికి వైరస్ సోకింది. ఇటీవలే ఇటలీకి వెళ్లొచ్చిన అతనికి కోవిడ్ పాజిటివ్ రావడంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి దేశవ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వారిలో ఇటాలియన్లు 16 మంది, ఒక ఇండియన్ డ్రైవర్, ఢిల్లీలో ఒకరు, ఆగ్రాలో 6, తెలంగాణ ఒకరు, కేరళలో 3, తాజాగా గుర్‌గావ్‌లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది.
కరోనా వ్యాప్తితో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం..అన్ని మార్గాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుర్‌గావ్ ఉద్యోగికి కరోనా సోకడంతో..పేటీఎం సంస్థ తమ ఉద్యోగులకు కొద్ది రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. ఇటు ఇండియన్ రైల్వే కూడా కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రతి డివిజనల్, సబ్ డివిజన్ ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు ఏర్పాటుచేయాలని ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పాఠశాల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కరోనాపై విద్యార్థులకు అవగాహన పెంచాలని సూచించారు. ఇక ఇంటర్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్‌లు ఉపయోగించేందుకు సీబీఎస్‌ఈ అనుమతిచ్చింది
వుహాన్, ఇటలీ లాంటి కరోనా వైరస్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలు కూడా ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.