కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నుంచే పుట్టిందా ? డాక్యుమెంటరీ ప్రూఫ్ ?

| Edited By: Pardhasaradhi Peri

Apr 01, 2020 | 5:38 PM

దాదాపు 200 దేశాలకు పైగా పాకిపోయిన కరోనా వైరస్ చైనాలోని వూహాన్ సిటీ నుంచే పుట్టి ఉండవచ్చునన్న ఊహాగానాలను నిజం చేస్తున్నట్టుగా ఓ డాక్యుమెంటరీ వెలుగులోకి వచ్చింది. టియాన్ జున్ హువా అనే రీసెర్చర్ తన టీమ్ తో కలిసి హుబీ ప్రావిన్స్ లోని గుహల్లో గబ్బిలాల కోసం సాగించిన వేట ఈ డాక్యుమెంటరీలోని ప్రధాన అంశం. ఏడు నిముషాలు గల ఇందులో..  ఈ పరిశోధకుడు గబ్బిలాల ద్వారా సంక్రమించే 300 రకాల వైరస్ లను కనుగొన్నాడంటే […]

కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నుంచే పుట్టిందా ? డాక్యుమెంటరీ ప్రూఫ్ ?
Follow us on

దాదాపు 200 దేశాలకు పైగా పాకిపోయిన కరోనా వైరస్ చైనాలోని వూహాన్ సిటీ నుంచే పుట్టి ఉండవచ్చునన్న ఊహాగానాలను నిజం చేస్తున్నట్టుగా ఓ డాక్యుమెంటరీ వెలుగులోకి వచ్చింది. టియాన్ జున్ హువా అనే రీసెర్చర్ తన టీమ్ తో కలిసి హుబీ ప్రావిన్స్ లోని గుహల్లో గబ్బిలాల కోసం సాగించిన వేట ఈ డాక్యుమెంటరీలోని ప్రధాన అంశం. ఏడు నిముషాలు గల ఇందులో..  ఈ పరిశోధకుడు గబ్బిలాల ద్వారా సంక్రమించే 300 రకాల వైరస్ లను కనుగొన్నాడంటే నమ్మశక్యం కాని నిజం. రాత్రి వేళ, చిమ్మ చీకటిలో.. తేమ, దుర్వాసన నిండిన గుహల్లో టియాన్ తన రీసర్చ్ వర్క్ కోసం గబ్బిలాలను పట్టేందుకు రోజులతరబడి కాపు కాశాడట. ఇది సుమారు పదేళ్ల అన్వేషణ అంటున్నాడాయన.’ వైరస్ శాంపిల్ కలెక్షన్ కోసం, క్లాసిఫికేషన్ కోసం.. మేం పూర్తి ప్రొటెక్ట్ సూట్లలో వివిధ గుహల్లో అన్వేషణ సాగించాం..

మనకు తెలిసిన అన్ని జంతువులు, పక్షుల్లో కెల్లా గబ్బిలాలు అనేక రకాల వైరస్ లను కలిగి ఉంటాయి. వీటిలో చాలావాటిలో మానవ వ్యాధులకు కారణమయ్యే కణాలు ఉంటాయని తెలుసుకున్నాం’ అని ఆయన చెప్పాడు. ఇలాంటి సాహస కృత్యాల్లో ఒక్కోసారి తనకు ఎంతో భయం వేస్తుంటుందని, ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతోనే వేసే ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా వేస్తుంటానని ఆయన అన్నాడు. ఈ వైరస్ లకు ఎవరైనా సులువుగా గురయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపాడు. అయితే ఈ వైరస్ శాంపిల్స్ ని కేవలం శాస్త్రీయ పరిశోధనల కోసమే భద్రపరుస్తామని, అంతే తప్ప.. నిజ జీవితంలో ఉపయోగించడానికి కాదని టియాన్ పేర్కొన్నాడు. అప్పటికప్పుడు తన బృందంలోని సభ్యులతో ఈయన ఆ గుహల్లోనే గబ్బిలాలనుంచి వాటి అవశేషాలను సేకరించడం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ప్రాథమిక పరిశోధనలు మొదట అక్కడే చేసి.. ఆ తరువాత ల్యాబ్ లో ఈ వైరస్ విశేషాలను విశ్లేషిస్తాడట.

చైనా అసోసియేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించే ‘చైనా సైన్స్ కమ్యూనికేషన్’ అనే వెబ్ సైట్ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది.. వూహాన్ సిటీలో కరోనా వైరస్ పుట్టుకకు (?) కొన్ని వారాలముందు డిసెంబరులో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. కాగా అనుకోకుండా ‘గబ్బిలం మూత్రాన్ని తన చేతులు తాకిన ఫలితంగ్గా 14 రోజులపాటు టియాన్ తనకు తాను  సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాడట. ఇలా ఉండగా.. ఈ వైరస్ కేవలం గబ్బిలాల నుంచే కాకుండా.. పాములు, ముంగిసలు, ఉడుములు, ఇంకా కొన్ని రకాల జంతువుల ద్వారా సంక్రమిస్తుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు..  2002 లో ముఖ్యంగా యూరప్ దేశాలను వణికించిన సార్స్ వైరస్ ను, దీన్ని పోల్చి.. సార్స్ -కోవిడ్-2 అనే వైరస్ గా కూడా దీన్ని వ్యవహరిస్తున్నారు. వూహాన్ లో సముద్ర జంతువులతో పాటు సాధారణ జంతువుల మాంసాన్ని కూడా విక్రయిస్తుంటారు. కుళ్ళిపోయిన జంతు అవశేషాల ద్వారా కూడా ఈ ప్రాణాంతక వైరస్ పుట్టి ఉండవచ్ఛునని భావిస్తున్నవారూ ఉన్నారు.

అటు-అమెరికా సైనికుల కుట్ర ఫలితమే ఈ వైరస్ పుట్టుక అని చైనా ఆరోపిస్తోంది. ఏమైనా.. ఇది ‘చైనా జీవాయుధమే’ అనే వ్యాఖ్యలు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

 

Video Credits: Mail online