దేశ రాజధానిలో విజృంభిస్తున్న కరోనా.. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి కరోనా పాజిటివ్..
దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తికి చలి తీవ్రత అనుకూలం కావడంతో అక్కడ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కు కరోనా సోకింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా అనుకూలంగా మారడంతో మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కు కరోనా సోకింది. స్వల్ప అస్వస్థతో బాధ పడుతున్న ఆయన.. గురువారం ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వైద్యులు ఆయనను ఐసోలేషన్ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
‘నాలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోండి. కరోనా నుంచి బయటపడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. కాగా, ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో 5,246 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనా నివారణకు ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.