భారత్‌లో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. కోరలు చాచిన కరోనా దేశప్రజల్ని వణికిస్తోంది. అప్పుడే పుట్టిన పసివాళ్లను నుంచి పండు ముదుసలిని కూడా వైరస్ వదలటం లేదు. దీనిని నివారించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, శానిటేషన్ సిబ్బంది, ఆఖరుకు వైద్యులను కూడా వైరస్ వెంటాడుతోంది. ఎయిమ్స్ వైద్యులకు కూడా క్వారంటైన్ తప్పటం లేదు.
కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కొందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో పని చేస్తున్న 30 ఏళ్ళ ఓ మేల్ నర్సుకు కరోనా వైరస్ సోకింది. దీంతో అక్కడ పని చేస్తున్న మరో 40 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు కోరారు. అలాగే సదరు మేల్ నర్స్ పని చేసే వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో ఇప్పటి వరకు 22 మందికి నెగెటివ్ అని తేలింది. మిగతా వారి రిపోర్టులు రావాల్సి ఉంది.
కరోనా బారిన పడిన మేల్ నర్స్ తనకు జ్వరం వచ్చిందని గత శనివారం వైద్యులకు ఫోన్ చేసి తెలిపాడు. సోమవారం హాస్పిటల్ కు వచ్చి టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే సోమవారం డ్యూటీ ఉండటంతో… బుధవారం రోజున టెస్టులు చేయించుకున్నాడు. కరోనా సోకినట్టు అదే రోజు రాత్రి రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం అతను ఎయిమ్స్ లోనే చికిత్స పొందుతున్నట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ఇప్పటి వరకు 2376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 50కి చేరింది.