రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తోంది. స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఇంటివద్దకే చేరవేసేలా చర్యలు చేపట్టింది. మరోవైపు గ్రామ వాలంటీర్ల సాయంతో ఇంటింటి సర్వేతో బయట నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. వైరస్ అనుమానిత వ్యక్తులు ఎవరు కనిపించినా వెంటనే క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల క్వారంటైన్ పడకలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా భూతం..ఏపీలోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. దీంతో మరింత అప్రమత్తమైంది జగన్ సర్కార్. అందులో భాగంగానే ఒక్కో నియోజకవర్గంలో 100 నుంచి 150 పడకలు క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసింది. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్నవి కాకుండా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ పడకలు 20 వేల వరకూ అందుబాటులోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఆస్పత్రులు, స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ భవనాలు, డిగ్రీ కళాశాలలు ఇలా ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఆ భవనాలన్నిటినీ కరోనా వైరస్ లక్షణాలున్న వారి కోసం సిద్ధం చేశారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక అందించినట్లుగా సమాచారం.
ఇక, ఒక్కో క్వారంటైన్‌కి ఇన్‌చార్జిగా మెడికల్ ఆఫీసర్‌ని నియమిస్తారు.. స్థానిక స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల విధులు క్వారంటైన్ కేంద్రంలోనే ఉంటాయి. ఒకక్కో కేంద్రంలో 100 పడకలకు తగ్గకుండా ఏర్పాటు పూర్తయ్యాయి. ఇందులో 10 పడకలు వెంటిలేటర్‌తో కూడినవిగా తెలుస్తోంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలుంటే వారిని తక్షణమే వారి పరిధిలో ఉన్న క్వారంటైన్‌కు తరలించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మరికొన్ని క్వారంటైన్ కేంద్రాలు పెంచేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హై రిస్కు ప్రాంతలైన విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో మరికొన్ని ప్రత్యేక కేంద్రాలు పెంచేయోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.