‘కవరప్ కాదు.. మా తప్పేం లేదు’…కోవిడ్-19 పై చైనా శ్వేతపత్రం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభించడానికి చైనాయే కారణమని, ఈ వైరస్ గురించి ప్రపంచ దేశాలకు సమాచారాన్ని తెలియజేయకుండా కావాలనే జాప్యం చేసిందని..

కవరప్ కాదు.. మా తప్పేం లేదు...కోవిడ్-19 పై చైనా శ్వేతపత్రం

Edited By:

Updated on: Jun 07, 2020 | 6:27 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభించడానికి చైనాయే కారణమని, ఈ వైరస్ గురించి ప్రపంచ దేశాలకు సమాచారాన్ని తెలియజేయకుండా కావాలనే జాప్యం చేసిందని వస్తున్న ఆరోపణల ‘దాడి’ నుంచి తమను తాము రక్షించుకునేందుకు డ్రాగన్ కంట్రీ ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ‘ఎందుకు మా మీద అంతా బురద జల్లుతున్నారు ? కరోనా రాకాసికి సంబంధించిన అన్ని విషయాలనూ ఈ వైట్ పేపర్ ద్వారా విశదీకరిస్తున్నాం.. వాస్తవాలేమిటో తెలుసుకోండి’ అంటూ సుదీర్ఘమైన సంజాయిషీ ఇచ్చింది.

ఈ వైరస్ ని మొదటిసారిగా గత డిసెంబరు 27 న వూహాన్ లో కనుగొన్నామని, ఇది వైరల్ న్యుమోనియా అని భావించామని, కానీ ఇది మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్ అని జనవరి 19 న తెలుసుకున్నామని ఈ శ్వేత పత్రంలో ప్రభుత్వం పేర్కొంది. వెంటనే దీన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వెల్లడించింది. డిసెంబరు 27 న వూహాన్ లోని ఓ ఆసుపత్రిలో దీన్ని ఐడెంటిఫై చేశాక.. స్థానిక ప్రభుత్వం నిపుణులను పిలిపించి రోగుల కండిషన్ ని విశ్లేషించడం ద్వారా ఆయా కేసులను పరిశీలించాలని కోరిందని ఈ పత్రం తెలిపింది. అలాగే క్లినికల్ ట్రయల్ ఫలితాలను, ప్రిలిమినరీ ల్యాబ్, టెస్టింగ్ రిజల్ట్స్ ను కూడా ఆ బృందం అధ్యయనం చేసిందని, చివరకి ఇది వైరల్ న్యుమోనియా అని నిర్ధారించిందని పేర్కొంది. అయితే నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఈ వైరస్ మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని తొలిసారిగా జనవరి 19 న కనుగొంది.. కానీ అంతకు ముందు ఇలా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ మిషన్ అవుతుందనడానికి   ఆధారాలు లభించలేదు..అని ప్రభుత్వం వివరించింది.

 

మా దేశంలో శ్వాస కోశ వ్యాధుల నిపుణుడైన వాంగ్  గ్వాంగ్ ఫా నేతృత్వంలోని నిపుణులు కొందరు వూహాన్ లో అడుగు పెట్టగానే అక్కడి కొంతమంది రోగుల లక్షణాలను పరిశీలించారు. ఆలాగే రోగుల సంఖ్య పెరగడాన్ని గుర్తించారు.. హ్యూనాన్ వెట్ మార్కెట్ తో కాంటాక్ట్ లేని రోగులను కూడా ఆ బృందం క్షుణ్ణంగా పరిశీలించి తమ స్టడీని మరికొంత ముందుకు తీసుకువెళ్లారు. ( తమ అధ్యయనాన్ని మెరుగు పరిచారు) అని ఈ శ్వేత పత్రం వివరించింది. గబ్బిలాలు, పాంగో లిన్ లు ఈ వైరస్ సంక్రమణానికి మూలమని అనుమానించామని, కానీ ఆ ఆధారాలు సరిపోలేదని వాంగ్ తెలిపారు. ఇది మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందా అన్న విషయాన్ని మరింతగా నిర్ధారించాల్సింది సైన్సేనని ఆయన అన్నారు. సరైన నిర్ధారణకు రాకుండా ఒక అభిప్రాయానికి వస్తే అది విపరీత పరిణామాలకు దారి తీస్తుందన్నారు.

కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు జరగాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిందని, దీనికి తాము కూడా మద్దతు తెలిపామని ప్రభుత్వం ఈశ్వేతపత్రంలో తెలిపింది. ఈ వైరస్ ని కట్టడి చేయడానికి వూహాన్ లోని ల్యాబ్ తో బాటు హ్యూబే ప్రావిన్స్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని జనవరి 14  న  ఈ సంస్థ కోరిందని వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని జాంగ్ అనే నిపుణుడు కూడా జనవరి 20 న మళ్ళీ నిర్ధారించగా ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశామని.. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆ సంస్థ కూడా భావించిందని ఈ శ్వేత పత్రం పేర్కొంది. అప్పుడే అమెరికాకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేసినట్టు వెల్లడించింది. పైగా కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్స్ ని కూడా విడుదల చేసినట్టు చైనా ప్రభుత్వం తెలిపింది.