మమత ఎఫెక్ట్.. ‘శ్రామిక్’ రైళ్ల విషయంలో మారిన రూల్స్

| Edited By: Pardhasaradhi Peri

May 19, 2020 | 7:35 PM

వలస కార్మికుల తరలింపునకు ఉద్దేశించిన శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, కేంద్రానికి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇక ప్రోటోకాల్ మార్పునకు కేంద్రం సమాయత్తమైంది.

మమత ఎఫెక్ట్.. శ్రామిక్ రైళ్ల విషయంలో మారిన రూల్స్
Follow us on

వలస కార్మికుల తరలింపునకు ఉద్దేశించిన శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, కేంద్రానికి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇక ప్రోటోకాల్ మార్పునకు కేంద్రం సమాయత్తమైంది. ఈ రైళ్లను తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని, దీన్ని అడ్డు పెట్టుకుని కేంద్రం రాజకీయం చేస్తోందని మమత ఇటీవల ఆరోపించారు. దీంతో కేంద్రం అసలు ఈ రైళ్లకు సంబంధించిన నిబంధనలనే మార్చివేసింది. ఈ శ్రామిక్ ట్రెయిన్స్ అంశంలో రాష్ట్రాల అనుమతే అవసరం లేదని మంగళవారం తేల్చి చెప్పింది. నిజానికి ఈ నెల 1 నుంచి పాటిస్తున్న ప్రోటోకాల్ ప్రకారం.. వలస జీవుల తరలింపు, ఈ రైళ్ల నిర్వహణపై ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం, పరస్పర అంగీకారం ఉండాలన్నది నిబంధన. కానీ పశ్చిమ బెంగాల్ తో బాటు బీహార్,  గోవా వంటి రాష్ట్రాలు కూడా ఈ విషయంలో విముఖత చూపుతున్నాయి. తమ రాష్ట్రానికి చేరుకున్న వలస జీవుల్లో 8 శాతం మందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఇలా అయితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ఇప్పటివరకు తమ రాష్ట్రంలో కరోనా ఛాయలే లేవని, కానీ వలస కార్మికుల కారణంగా ఇన్ఫెక్షన్ కేసులు బయటపడుతున్నాయని వెల్లడించారు. ఇలా ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం  తమ సమస్యలు చెప్పుకోవడంతో కేంద్రం రూల్స్ నే మార్చివేసినట్టు కనబడుతోంది. అటు-ఉంఫన్ తుఫాను కారణంగా తమ రాష్ట్రంలోకి గురువారం వరకు శ్రామిక్ రైళ్లను పంపరాదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా కేంద్రాన్ని కోరారు.