కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం.. మోదీపై పరోక్ష ధ్వజం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం చూస్తే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేశారా అనిపిస్తోంది. బడ్జెట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని పరోక్షంగా విమర్శించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. వృద్ధి రేటు తగ్గిన తీరు, ఆర్థిక మాంద్యం గురించి ఎక్కువగా ప్రస్తావించడం ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. వాహనాల మార్కెట్ దెబ్బతిన్నదని, దాంతో కొన్ని ఆటో‌మొబైల్ కంపెనీలు ఉత్పత్తిని నిలుపుదల చేశాయని సీఎం […]

కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం.. మోదీపై పరోక్ష ధ్వజం
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 4:44 PM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం చూస్తే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేశారా అనిపిస్తోంది. బడ్జెట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని పరోక్షంగా విమర్శించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. వృద్ధి రేటు తగ్గిన తీరు, ఆర్థిక మాంద్యం గురించి ఎక్కువగా ప్రస్తావించడం ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

వాహనాల మార్కెట్ దెబ్బతిన్నదని, దాంతో కొన్ని ఆటో‌మొబైల్ కంపెనీలు ఉత్పత్తిని నిలుపుదల చేశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివల్ల వాహనాల రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని, ఆయా రంగాలకు సంబంధించిన వేలాది మంది ఉపాధిని కోల్పోయారని కేసీఆర్ ఆరోపించారు. అంతేకాదు బొగ్గు గనుల్లో ఉత్పత్తి తగ్గించవలసి వచ్చిందని అన్నారు. అయితే ఇదంతా జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాలని, అదే ప్రభావం తెలంగాణ పై కూడా పడిందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ఆదాయంలో వృద్ధి రేటు తగ్గిందని అన్నారు. ఇక తెలంగాణలో చూస్తే 5 శాతం మాత్రమే ఆదాయం పెరిగిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం పన్నులలో వృద్ధి 13 శాతం ఉంటే, ఈ ఏడాది 6 శాతం మాత్రమే ఉందని అన్నారు.

గతంలో కూడా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఉద్యోగులు, సామాన్య ప్రజలు, రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ప్రజలందరికీ ఇబ్బందులు తప్పడం లేదని ఆయన ఆరోపించారు. ముందు జరగబోయే పర్యవసానాలను అంచనా వేయకుండా కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. అంతేకాదు తాజాగా ట్రాఫిక్ నిబంధనల విషయంలో కేంద్రం తీసుకున్న కొత్త చట్టంపైనా కేసీఆర్ స్పందించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో మైనస్ వృద్ధి రేటు ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దీనివల్ల రానున్న రోజుల్లో వెహికిల్ కొనుగోళ్లు పూర్తిగా తగ్గుతాయని చెప్పారు. అయితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన చేశామని కేసీఆర్ చెప్పారు.

ఇతర రాష్ట్రాలలో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో కాస్త మెరుగ్గా ఉందని అన్నారు. అయితే కేంద్రం నిర్ణయాల కారణంగానే ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులు తలెత్తాయని సీఎం కేసీఆర్ డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ.. పదే పదే ఆర్థిక మందగమనం ఉందని ఆయన ప్రస్తావించడం బీజేపీని టార్గెట్ చేయడమే అవుతుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆర్థిక నిపుణుల నుంచి కూడా కేంద్రానికి విమర్శలు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే.. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం దాపురించిందని వారు అభిప్రాయపడుతున్నారు.