
UPSC సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు చదువు ఎంత ముఖ్యమో, క్రమశిక్షణతో కూడిన రోజువారీ రొటీన్, సరైన ప్లానింగ్, తప్పుల నుంచి నేర్చుకోవడం కూడా అంతే కీలకం. ఇంజినీరింగ్ నేపథ్యం నుంచి వచ్చి సివిల్స్‌లో ఏకంగా 11వ ర్యాంకు సాధించిన వరంగల్ అభ్యర్థి సాయి శివాని తన ప్రిపరేషన్ విధానం, రోజువారీ టైమ్‌టేబుల్, ప్లానింగ్, మొదటి ప్రయత్నంలో ఎదురైన నిరాశను ఎలా అధిగమించిందో ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
తనకు చిన్నప్పటి నుంచే ఒక డిసిప్లిన్‌డ్ రొటీన్‌పై నమ్మకం ఉందని ఆమె తెలిపారు. అందుకే ప్రతిరోజూ నిద్రపోయే సమయం, నిద్రలేచే సమయం ఒకేలా ఉండేలా చూసుకునేవారు. బర్త్‌డే అయినా, ఆదివారం అయినా, పండుగైనా.. ఉదయం 5 గంటలకు లేవడం మాత్రం మారేది కాదని చెప్పారు. ఉదయం లేచిన తర్వాత ముందుగా గత రోజు చదివిన అంశాలను రివిజన్ చేసేవారు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి యోగా, మెడిటేషన్ చేసేవారు. చదువును ఒకేసారి గంటల తరబడి కాకుండా పలు స్లాట్లుగా విభజించుకుని చదివినట్లు సాయి శివాని తెలిపారు. అలా రోజుకు సాధారణంగా 3 నుంచి 4 స్టడీ స్లాట్లు పెట్టుకునేవారు. ఒక్కో స్లాట్ సుమారు 2.5 నుంచి 3 గంటల పాటు ఉండేది. మధ్యలో అవసరమైన బ్రేక్‌లు తీసుకునేవారు. మధ్యాహ్నం సుమారు అరగంట పాటు నిద్రపోయేవారు. సాయంత్రం కొంత సమయం బ్రేక్ తీసుకుని, రాత్రి ముఖ్యమైన వార్తలు, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలను కవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక రాత్రి 10:30 గంటలకల్లా చదువు ముగించి నిద్రపోయినట్లు తెలిపారు.
ప్రిపరేషన్ సమయంలో సాధారణంగా రోజుకు 6 నుంచి 8 గంటలు చదివేవారని ఆమె చెప్పారు. చదువుతో పాటు పుస్తకాలు చదవడం, పెయింటింగ్, యోగా వంటి తనకు ఇష్టమైన హాబీలకు కూడా కొంత సమయం కేటాయించేవారు. అయితే పరీక్షలు దగ్గరపడే కొద్దీ చదివే గంటలను పెంచేవారు. ముఖ్యంగా UPSC మెయిన్స్ సమయంలో చదువు మరింత పెరిగేది. పరీక్ష డిమాండ్‌ను బట్టి రోజుకు 14 నుంచి 15 గంటల వరకు చదివిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. తన ప్రిపరేషన్‌లో డైలీ ప్లానర్ చాలా కీలకంగా పనిచేసిందని ఆమె వెల్లడించారు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మరుసటి రోజు ఏయే టాపిక్స్ పూర్తి చేయాలి? ఎలాంటి టార్గెట్లు చేరుకోవాలి? అనే విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకునేవారు. అంతేకాకుండా వారానికి ఏం పూర్తి చేయాలి? వచ్చే నెలలో ఏయే అంశాలను పూర్తి చేయాలి? అనే దానిపై కూడా స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకునేవారు. ఈ టార్గెట్లను రాసుకుని గోడకు అంటించేవారు.
సాయి శివాని మాక్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులు రాసిన తర్వాత వాటిలో చేసిన తప్పులను కూడా ప్రత్యేకంగా గుర్తించేవారు. తన మిస్టేక్ ఏరియాస్ ఏంటి? ఏ అంశాల్లో మళ్లీ తప్పులు జరుగుతున్నాయి? అనే విషయాలను రాసుకుని గోడకు అంటించేవారు. రోజూ వాటిని చూడటం వల్ల తన తప్పులు గుర్తుండేవని, తర్వాతి పరీక్షల్లో అవే తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడగలిగానని తెలిపారు. ప్రిపరేషన్ సమయంలో అర్థం కాని అంశాలు ఎదురైనప్పుడు ప్రత్యేకంగా ఎవరినైనా ఆశ్రయించాల్సిన అవసరం ఎక్కువగా రాలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సమాచారానికి కొదవ లేదని, ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే Google, YouTube వంటి ఆన్‌లైన్ వనరులను సమర్థంగా ఉపయోగించుకున్నానని చెప్పారు. అయితే అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని చదవడం కాకుండా, అవసరమైన సమాచారాన్ని గుర్తించి ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవడం ముఖ్యమని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
తొలి ప్రయత్నంలో UPSCలో విజయం సాధించలేకపోయినప్పుడు తీవ్రంగా నిరాశ చెందినట్లు ఆమె తెలిపారు. చిన్నప్పటి నుంచి తన అకడమిక్ రికార్డు బాగుండటంతో పాటు, సివిల్స్ తనకు చిన్నప్పటి నుంచే ఇష్టమైన రంగమని చెప్పారు. అందుకే ఎంతో కష్టపడి చదివినప్పటికీ ఫలితం రాకపోవడం బాధ కలిగించిందన్నారు. ఒక దశలో ‘మళ్లీ పరీక్ష రాయాలా?’ అనే సందేహం కూడా వచ్చిందని తెలిపారు. ఇంత కష్టపడి చదివినా విజయం రాకపోతే, ఈ పరీక్ష తనకు మరింత కష్టమేమో అనే సెల్ఫ్ డౌట్ కూడా కలిగిందన్నారు. అయితే మొదటి ప్రయత్నం తర్వాత నిరాశతో ఆగిపోలేదు. తన ప్రిపరేషన్‌ను వెనక్కి తిరిగి చూసుకుని ఎక్కడ తప్పులు జరిగాయి? ఏ అంశాలను ఇంకా మెరుగుపరచాలి? అనే విషయాలను విశ్లేషించారు. ‘ఇంతకుముందు కంటే ఒకసారి మరింత మెరుగ్గా ప్రయత్నిద్దాం’ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తనను ప్రోత్సహించారని తెలిపారు. వారి ప్రోత్సాహంతో మళ్లీ ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధమయ్యానన్నారు.
ఆమెకు మరో సవాలు కూడా ఎదురైంది. ఇంజినీరింగ్ నేపథ్యం నుంచి రావడంతో UPSC సిలబస్‌లోని కొన్ని హ్యూమానిటీస్ సబ్జెక్టులు కొత్తగా అనిపించాయి. పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ వంటి అంశాలను పాఠశాల స్థాయిలోనే చదివి ఉండటంతో, ఇంజినీరింగ్ తర్వాత వాటిని మళ్లీ లోతుగా చదవాల్సి వచ్చింది. అందుకే సబ్జెక్టుల వారీగా అవసరమైన సమయాన్ని కేటాయిస్తూ, బేసిక్స్ నుంచి ప్రిపరేషన్ ప్రారంభించడం తనకు ఉపయోగపడిందని ఆమె వివరించారు.
ఈ ప్రిపరేషన్ విధానం నుంచి UPSC అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్చుకోవచ్చు..