తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షపై టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది.. గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది.. డీఎస్సీ పరీక్షల కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో గ్రూప్-2 ను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త తేదీలని త్వరలోనే ప్రకటించనుంది. గ్రూప్ – 2లో 783 పోస్టులు ఉండగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ, గ్రూప్-2 వెంటవెంటనే ఉండటంతో వాయిదా వేయాలని అభ్యర్థులు గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో రేవంత్ సర్కార్ అభ్యర్థుల వినతులకు అనుగుణంగా డిసెంబర్ నెలకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది..
వాస్తవానికి గత కొంతకాలం నుంచి డీఎస్సీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం డీఎస్పీ పరీక్షలను వాయిదా వేయడానికి నిరాకరించింది.. ఈ క్రమంలో ప్రభుత్వం నిన్న అభ్యర్థులతో చర్చలు జరిపింది.. పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో సానుకూలంగా స్పందించింది.
మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీజీపీఎస్సీ గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్ 2 వాయిదా వేశారు.. తాజాగా మరోసారి వాయిదా వేశారు.