షాకింగ్ సీన్‌.. TET ఫలితాల్లో ఏకంగా 14,814 మంది ప్రభుత్వ బడి టీచర్లు ఫెయిల్.. గిట్లాగైతే కష్టమే!

సోమవారం విడుదలైన టెట్ జూన్‌ 2026 ఫలితాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం కేవలం 37.29గా నమోదైంది. పరీక్షకు హాజరైన 23,623 మంది ఉపాధ్యాయుల్లో 14,814 మంది ఫెయిల్ అయ్యారు. 2028 ఆగస్టులోపు టెట్‌ ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉండటంతో ఈ ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి..

షాకింగ్ సీన్‌.. TET ఫలితాల్లో ఏకంగా 14,814 మంది ప్రభుత్వ బడి టీచర్లు ఫెయిల్.. గిట్లాగైతే కష్టమే!
Telangana Govt Teachers Fail in TET Exam

Updated on: Jul 14, 2026 | 10:59 AM

హైదరాబాద్‌, జులై 14: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌ జూన్‌ 2026) ఫలితాలు సోమవారం (జులై 13) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ విడుదల చేశారు. తాజాగా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైంది. జూన్‌ 16 నుంచి 22 మధ్య మొత్తం 10 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జూన్‌ సెషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం 1,15,028 (74.81శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 23,623 మంది ఇన్‌సర్వీస్‌ టీచర్లు కూడా ఉన్నారు.

ఇక ఈ టెట్ పరీక్షలో ఏకంగా 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్ అవడం గమనార్హం. గత నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా.. ఈ పరీక్షలో కేవలం 8,809 మంది ఉపాధ్యాయులు మాత్రమే పాస్ అయ్యారు. అంటే వారి ఉత్తీర్ణత 37.29 శాతమే నమోదైంది. వీరిలో 14,814 మంది టెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. గత ఏడాది 50 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ఈసారి కేవలం 37.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా.. ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నెలలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

జులై 21న ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ జులై 21న స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. సెప్టెంబర్‌ 7 నుంచి 11వరకు ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Follow Us