TS EAPCET 2026: నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. టాప్ కాలేజీల్లో సీటు కావాలంటే ఇవి గుర్తుంచుకోండి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభమవనుంది. జూన్‌ 19 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ కొనసాగనుండగా, తొలి విడత సీట్ల కేటాయింపు జూలై 10న జరగనుంది. మొత్తం 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ ర్యాంకుకు అనుగుణంగా కాలేజీలు, బ్రాంచీలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..

TS EAPCET 2026: నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. టాప్ కాలేజీల్లో సీటు కావాలంటే ఇవి గుర్తుంచుకోండి
TS EAPCET Engineering Counselling

Updated on: Jun 19, 2026 | 6:28 AM

హైదరాబాద్‌, జూన్‌ 19: రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నేటి నుంచి (జూన్ 19) నుంచి మొదలవనుంది. ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఇక నేటి నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు కూడా చేసుకోవచ్చు. జూన్‌ 19 నుంచి 28 వరకు స్లాట్‌ బుకింగ్‌కు చేసుకోవచ్చు. ఇక జూన్‌ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. జూన్‌ 25 నుంచి జులై 1 వరకు వెబ్‌ ఆప్షన్స్‌కు అవకాశం ఉంటుంది. మాక్‌ సీట్ల కేటాయింపు జూలై 4న ఉంటుంది. వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవడానికి జూలై 5 నుంచి 7 వరకూ అవకాశం ఇస్తారు. ఇక జూలై 10న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు జులై 10 నుంచి 14 వరకు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవల్సి ఉంటుంది. ఇప్పటికే కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సాంకేతిక విద్య మండలి పూర్తి చేసింది.

తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026 రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాష్ట్రంలోని దాదాపు 159 కాలేజీలు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద, మిగిలిన సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. ఇంజనీరింగ్‌ సీట్ల వివరాలు ఇప్పటికే కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆప్షన్‌ ఇచ్చేటప్పుడు బ్రాంచీ, కాలేజీలపై విద్యార్థులు ముందుగా అవగాహన కలిగి ఉండాలి. ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏయే ర్యాంకుకు ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీలో సీటు వస్తుందో అంచనాకు రావాలి. గత ఏడాది కటాఫ్‌లను ప్రామాణికంగా తీసుకుంటే ఈ విషయంలో కొంత స్పష్టత ఉంటుంది. సీటు లభ్యత ఉన్న కాలేజీల జాబితాల్లో నచ్చిన కాలేజీలను మొదటి ఆప్షన్‌గా ఎంచుకోవాలి. ఇదేవిధంగా బ్రాంచీ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. 50 వేలపైన ర్యాంకు వచ్చిన విద్యార్ధికి తన ర్యాంకుతో టాప్‌ కాలేజీల్లో సీటు కోసం ఆప్షన్‌ ఇస్తే కటాఫ్‌ ప్రకారం సీటు రాకపోవచ్చు. ముందుగా విద్యార్థి ర్యాంకుకు తగ్గ కాలేజీలు, బ్రాంచీలకు తొలి కౌన్సెలింగ్‌లో 70 వేల ర్యాంకు వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026 రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాప్‌ కాలేజీల్లో సీటు కావాలంటే10 వేల లోపే ర్యాంకు ఉండాలి. ఈసారి విద్యార్థుల అందరి చూపు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ మీదే ఉంది. గత ఏడాది 68 శాతం విద్యార్థులు సీఎస్‌ఈ ఎంచుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఈసీఈ, సీఎస్‌ఈ కోర్‌ గ్రూపుల్లో విద్యార్థుల చేరికలు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. టాప్‌ కాలేజీల్లో గరిష్టంగా 10 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుందని అంచనాలు చెబుతున్నాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌ వంటి క్యాంపస్‌లలో సీఎస్‌ఈతోపాటు అన్ని గ్రూపులకు పోటీ తీవ్రంగానే ఉంది. సీఎస్‌ఈలో 2 వేల లోపు, ఈసీఈలో 5 వేల లోపు మాత్రమే ర్యాంకు ఉంటే సీటు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే చేరేందుకు మొగ్గు చూపుతుండటంతో అనుబంధ కాలేజీల్లో పెద్దగా డిమాండ్‌ ఉండటం లేదు. కాబట్టి కౌన్సెలింగ్‌లో విద్యార్ధులు తమ ర్యాంకు ఆధారంగా నచ్చిన కాలేజీలో సీటు పొందడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది.

Follow Us