TG EAPCET 2026 Strategy: ఈఏపీసెట్‌కు 30 రోజుల వ్యూహం.. టాప్ స్కోరు కావాలంటే ఇలా చదవండి!
How to Crack EAPCET 2026 in 30 Days: జేఈఈ తరువాత ఈఏపీసెట్ ఎంతో కీలకమైన మైలురాయి. రాష్ట్రం నుంచి దాదాపు 3 లక్షల మంది ఈసారి ఈఏపీసెట్‌కు పోటీపడే అవకాశం ఉంది. టాప్ కాలేజీల్లో సీటు సంపాదించడం అంటే కేవలం ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాదు. వృత్తిపరమైన కెరీర్‌కు ఒక పటిష్టమైన బాట వేసుకోవడం కూడా. కాబట్టి రాష్ట్ర స్థాయిలో..

హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 4, 2026తో ఆలస్య రుసుములేకుండా దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. రూ.250 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి మే 2, 2026వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ 2026 ర్యాంకు చాలా కీలకం. ఇక ఈఏపీసెట్ పరీక్షలు మే 9 నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో రోజుకు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి. కాగా పరీక్షకు ఇంకా నెల రోజుల గడువు మాత్రమే ఉంది. జేఈఈ తరువాత ఈఏపీసెట్ ఎంతో కీలకమైన మైలురాయి. రాష్ట్రం నుంచి దాదాపు 3 లక్షల మంది ఈసారి ఈఏపీసెట్‌కు పోటీపడే అవకాశం ఉంది. టాప్ కాలేజీల్లో సీటు సంపాదించడం అంటే కేవలం ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాదు. వృత్తిపరమైన కెరీర్‌కు ఒక పటిష్టమైన బాట వేసుకోవడం కూడా. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ కాలేజీల్లో కీలక కోర్సులను ఎంచుకునే అభ్యర్థులకు ఈఏపీసెట్ చాలా ముఖ్యం. ఈ క్రమంలో తక్కువ సమయంలో మంచి ర్యాంకు కొట్టాలంటే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం శక్తివంచన లేకుండా నిబద్ధతతో.. ప్రణాళికతో.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం.
30 రోజుల ప్రిపరేషన్ ప్లాన్..
30 రోజుల వ్యవధిలో 10 రోజులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10 రోజులు ఇంటర్ సెకండ్ ఇయర్, మిగిలిన 10 రోజులు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాయాలి. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి. సబ్జెక్టుల వారీ పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉన్న పాఠ్యాంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యమైన ఫార్ములాలు, సిద్ధాంతాలు, హింట్‌లు, షార్ట్‌కట్‌లు నోట్ పుస్తకంలో రాసుకోవాలి. పాఠ్యాంశం చదివిన తర్వాత అందులోని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. సందేహాలు ఉంటే వాయిదా వేయకుండా వెంటనే నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత రివిజన్‌కు కూడా కొంత సమయం కేటాయించుకోవాలి. వీటితోపాటు గత పదేళ్ల క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. నెగెటివ్ మార్కులు లేవు కాబట్టి.. తెలియని ప్రశ్నలకు కూడా కొంచెం స్మార్ట్‌గా ఆలోచించి ఆన్సర్ చేయవచ్చు. అయితే ఆన్సర్ పెట్టే ముందు ప్రశ్న పూర్తిగా చదివి ఆ తర్వాతే జవాబు కోసం ప్రయత్నించాలి. ఏ సెషన్ అయినా దాదాపు సగం ప్రశ్నలు సులువుగానే ఉంటాయి. ముందు వాటికి సమాధానం గుర్తించాలి. తర్వాత 30 శాతం ప్రశ్నలు మధ్యస్థంగా ఉంటాయి. వీటికి కొంచెం సమయం వెచ్చించి, ఆలోచిస్తే జవాబు వచ్చేస్తుంది. మిగిలిన 20 శాతం ప్రశ్నలకు మీ ట్యాలెంట్ చాలా అవసరం. అందుకే కష్టమైన ప్రశ్నలను ఎల్లప్పుడు చివరిలోనే ప్రయత్నించాలి.
ఈఏపీసెట్ 2026 పరీక్ష విధానం..
ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 160 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలకు 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయిస్తారు. ఇందులో 120కి పైగా మార్కులు దక్కించుకుంటే కీలక సంస్థలో సీటు దక్కుతుంది. అలాగే స్కోరు వంద దాటినా పర్లేదు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్ష కూడా 160 ప్రశ్నలకు 160 మార్కులకే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు నుంచీ 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
సబ్జెక్టుల వారీగా కీలక టాపిక్స్
భౌతికశాస్త్రం
ఫిజిక్స్‌లో ముఖ్యమైన సూత్రాలు, యూనిట్లు, సిద్ధాంతాల చుట్టూ ప్రశ్నలు అడుగుతారు. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందడానికి సులభమైన పాఠాలు ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాతే మిగిలినవి నేర్చుకోవాలి.
కెమిస్ట్రీ
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే 40 మార్కులకు కనీసం 30 తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. చాలా వరకు ప్రశ్నలు నేరుగానే వస్తాయి. ప్రాథమికాంశాలు, నియమాలు, సమీకరణాలు ప్రాధాన్యంతో చదవాలి.
మ్యాథమెటిక్స్
ఇంజినీరింగ్‌లో ర్యాంకును నిర్ణయించేంది ఈ సబ్జెక్టు మాత్రమే. సగం మార్కులు ఈ సబ్జెక్టు నుంచే వస్తాయి. ఫార్ములాలు, ప్లాబ్లమ్ సాల్వింగ్ బాగా సాధన చేయాలి. ప్రాథమికాంశాలు, అనువర్తనాలను విస్మరించకూడదు. సులువైన అధ్యాయాలు ముందుగా పూర్తిచేసుకోవాలి. ఈ విభాగంలో బాగా సాధన చేస్తే 80కి 60 వరకు మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉంటున్నాయి. అప్లికేషన్ విధానంలో ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల ప్రశ్న బాగా చదివి అర్థం చేసుకుని, జవాబు గుర్తించాలి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




