సర్కార్‌ బడి టీచర్లకు TET తప్పనిసరే.. 2028 ఆగస్ట్‌ వరకు గడువు పొడిగింపు

టెట్ అర్హత పొందేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువును 2027 ఆగస్టు 31 నుంచి 2028 ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో వెల్లడించారు. లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మంత్రి మాట్లాడుతూ, 2026 మే 29న రివ్యూ పిటిషన్లను పరిష్కరించిన..

సర్కార్‌ బడి టీచర్లకు TET తప్పనిసరే.. 2028 ఆగస్ట్‌ వరకు గడువు పొడిగింపు
TET Qualification Deadline Extended

Updated on: Aug 04, 2026 | 3:54 PM

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 4: ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అర్హత తప్పనిసరేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత పొందేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువును 2027 ఆగస్టు 31 నుంచి 2028 ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో వెల్లడించారు. లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మంత్రి మాట్లాడుతూ, 2026 మే 29న రివ్యూ పిటిషన్లను పరిష్కరించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఉపాధ్యాయులకు మరో ఏడాది అదనపు గడువు మంజూరు చేసిందని తెలిపారు. దీంతో పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం (RTE Act) 2009 ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు అవసరమైన కనీస అర్హతను నిర్ణీత గడువులోగా పొందే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు 2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పులో టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి కనీస అర్హతగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆర్‌టీఈ చట్టంలోని సెక్షన్ 23 పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది.

విద్య అంశం భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (Concurrent List)లో ఉందని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఉపాధ్యాయుల నియామకాలు, సేవా నిబంధనలు, విధుల కేటాయింపు వంటి అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా పరిధిలో ఉంటాయని వెల్లడించింది. తాజా తీర్పులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున, ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించడం ద్వారా అర్హులైన అభ్యర్థులకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి, కోర్టు నిర్దేశించిన గడువులోగా అవసరమైన అర్హత పొందే అవకాశం లభిస్తుందని పేర్కొంది.

టెట్ తప్పనిసరి నిబంధన ప్రభావం 2013కు ముందు నియమితులైన కొంతమంది ఉపాధ్యాయులపై ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అలాంటి ఉపాధ్యాయుల వివరాలు, రికార్డులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్దనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us