
హైదరాబాద్, జులై 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి పాఠశాల విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ మరో వారంలో విడుదలకానున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ జూలై 21న విడుదల కానుంది. వీరికి ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇన్‌సర్వీస్ టీచర్లకు రెండు సార్లు స్పెషల్ టెట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. అలాగే మరో రెండు సాధారణ టెట్‌లు కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తంగా ఒకే ఏడాదిలో నాలుగు టెట్లు నిర్వహిస్తారన్నమాట.
తెలంగాణలో తాజాగా టెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ సెషన్‌కు నిర్వహించిన టెట్ 2026 పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22 వరకు 10 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 1,53,752 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,15,028 మంది (74.81శాతం) హాజరయ్యారు. వీరిలో 50,544 మంది అర్హత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైందని తెలిపారు. వీరిలో 23,623 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు ఉండగా.. వారి ఉత్తీర్ణత 37.29 శాతంగా నమోదైంది.
ఇక పేపర్ 1లో 65.29 శాతం, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 40.76 శాతం, పేపర్ 2 సోషల్ స్టడీస్‌లో 25.79 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ నిర్ణయాలతో ఉపాధ్యాయులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాన రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. ఈ క్రమంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం స్పెషల్ టెట్ నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావించింది.