
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా పదో తరగతి మెమోలో ఉన్న పేరు, ఆధార్‌లో నమోదైన పేరు ఒకేలా లేకపోతే విద్యార్థుల దరఖాస్తులు ఆమోదం పొందవు. కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసే సమయంలో పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పుట్టినతేదీ, పాస్ అయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు అధికారుల డేటాబేస్‌తో సరిపోలిన తర్వాతే అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. చిన్న పొరపాటు ఉన్నా దరఖాస్తు అక్కడికక్కడే నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇక దరఖాస్తులో కేవలం విద్యా వివరాలే కాదు.. కులం, ఉపకులం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కాలేజీ, జిల్లా, మండలం వంటి పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్‌లోని పేరు, పదో తరగతి మెమోలోని పేరు మ్యాచ్ కావడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దరఖాస్తు తొలి దశ పూర్తయ్యాక విద్యార్థికి ప్రత్యేక ఐడీ జారీ అవుతుంది. ఆ తర్వాత మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. అనంతరం మాత్రమే ఆన్‌లైన్‌లో పూర్తి అప్లికేషన్ సమర్పించే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే స్కాలర్‌షిప్‌లు పొందుతున్న రెన్యువల్ విద్యార్థులకు కూడా ఇదే విధానం వర్తించనుంది. ప్రతి ఏడాది తెలంగాణలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం అప్లై చేస్తున్నారు. వీరి కోసం ప్రభుత్వం సుమారు రూ.2400 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఈ భారీ మొత్తాన్ని పారదర్శకంగా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఆధార్ ధ్రువీకరణతోనే ఫీజులు విడుదలయ్యేవి. కానీ ఇకపై విద్యార్థి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు నేరుగా ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్‌లు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ విద్యార్థులకు అమలవుతున్న డైరెక్ట్ బెనిఫిట్ విధానాన్ని ఇప్పుడు ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు కూడా విస్తరించనుంది.
అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 20 శాతం మంది విద్యార్థుల ఆధార్‌లో పేర్లు లేదా ఇంటిపేర్లలో తప్పులు ఉన్నాయి. దీంతో చాలామంది ఆధార్ సవరణలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి సెలవుల్లోనే ఈ మార్పులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ ఉండటం తప్పనిసరి చేశారు. ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా కూడా ఉండాలి. విద్యార్థి ఖాతా వివరాలు, ఆధార్ ధృవీకరణ పూర్తయ్యాకే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయనుంది.
మరిన్నికెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ చేయండి.