Free Training classes for Telangana police job aspirants: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థులకు ఉచిత శిక్షణకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఇందుకోసం పలు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 వేల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా, 6 వేల మంది హాజరయ్యారు. నాచారం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం పరిధిలోని పలు పరీక్ష కేంద్రాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ (CP Mahesh Bhagwat) సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ల సహకారంతో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాతపరీక్షతో పాటు 100 మీటర్ల పరుగులాంటి ప్రాథమిక ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్ని నిర్వహించి, తుది జాబితాను ఎంపిక చేయనున్నారు.
కాగా పోలీస్ విభాగంలో భర్తీ చేయనున్న 18,334 కొలువుల సాధనకు యువతను సన్నద్ధం చేసే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ ఉచిత శిక్షణ శిబిరాల ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అందుకు ప్రాథమికంగా స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన యువతకు 90 రోజులు శిక్షణ ఇవ్వనుంది. హోంశాఖ పరిధిలోని ఉద్యోగాలకు దేహదారుఢ్యం కంపల్సరీ కావడంతో జిల్లాల్లోని పోలీస్ శిక్షణ కేంద్రాల (Police training centers)మైదానాలను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక హోంశాఖ ఆధ్వర్యంలో 2015లో 9281, 2018లో 18,143 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా.. ఈసారి అంతకన్నా ఎక్కువగా 18,334 పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో మాదిరిగానే యువతకు ఉచిత శిక్షణ శిబిరాల్ని(free training) ఏర్పాటు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఇప్పటికే అన్ని యూనిట్ల పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. కిందటిసారి హోంశాఖలో కొలువుల భర్తీ నోటిఫికేషన్‌కు ఏకంగా 6 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. ఈక్రమంలో వీలైనంత ఎక్కువమందికి పోలీస్‌శాఖ తరఫున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో 95 శాతానికి పైగా కానిస్టేబుల్ కొలువులే. కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చాక ఈఉద్యోగాల భర్తీ ఇదే తొలిసారి. ఈ వ్యవస్థలో కానిస్టేబుల్ పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో యూనిట్ల వారీగా పోటాపోటీగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మహిళా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వారికి సురక్షితమైన వసతి ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.
Also Read: