TS Govt Jobs Notification 2022: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగావున్న 80,039 కొలువుల భర్తీకి కార్యచరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఐతే నియామకాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షల సిలబస్, పరీక్ష విధానం వంటి తదితర అంశాలపై పోటీపడే అభ్యర్ధులకు సందేహాలు లేకపోలేదు. వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ త్వరాలో ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తాజాగా పరీక్షలు ఆన్‌లైన్ (online exams)లో జరుగుతాయా? లేదా ఆఫ్‌లైన్‌లో జరుగుతాయా అనే విషయానికి సంబంధించి ఓ ప్రకటన వెలువడింది. అందేంటంటే.. కొత్త నియామకాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్‌కైనా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య 40,000ల కంటే తక్కువ ఉంటే ఆ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటే ఆఫ్‌లైన్ (రాత పరీక్ష)లో పరీక్షలు నిర్వహించనుంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలు లిఖితపూర్వకంగా జరుగుతుంటాయి. ఈసారి నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ ఆరా తీస్తోంది. ఎందుకంటే ఆన్‌లైన్ పరీక్షలకు కంప్యూటర్లు, నెట్‌వర్క్, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు అవసరం అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగానున్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలు, ఇతర సంస్థల్లో దాదాపు 50,000ల కంప్యూటర్లు అందుబాటులో ఉన్నట్లు తేలింది. ఈ కాలేజీల్లో 40,000ల మంది వరకు పరీక్షలు రాసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్1, పోలీసు, విద్యాశాఖ వంటి వాటికి లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలున్నందున వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించడం కుదరదు. ఇంజనీర్లు, వైద్యులు, ఇతర కేటగిరిలకు జరిగే పరీక్షల్లో 40,000ల మంది లోపే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్షల సన్నద్ధతపై త్వరలోనే రాష్ట్ర నియామకాల కమిటీతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. సమావేశం అనంతరం ఏయే కేటగిరీలకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలి, ఏఏ పోస్టులకు ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించాలనే అంశంపై కూలంకషంగా తెలపనున్నట్లు సమాచారం.
Also Read: