హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో డీఎస్సీ ఫలితాల విడుదలపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఇటీవల విడుదల చేసిన ఫైనల్ కీపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంపై విద్యాశాఖ నోరు విప్పడం లేదు. సెప్టెంబర్ 5 నాటికే డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేస్తామని ప్రగడ్భాలు పలికిన సర్కార్.. నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల చేయకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. సెప్టెంబర్ 6న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ తుది ‘కీ’ని విడుదల చేయగా, 210కిపైగా అభ్యంతరాలు వచ్చాయి. పైగా ప్రాథమిక కీపై తాము అభ్యంతరాలు గుర్తించి, తగిన ఆధారాలను చూపినా తుది ‘కీ’లో వాటిని తప్పుగా ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు కూడా. వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ పరిశీలనకు పంపించారు. అప్పటి నుంచి ఫలితాల ప్రక్రియ అతీగతీ లేకుండా పోయింది.
డీఎస్సీలో అభ్యర్ధులకు వచ్చిన మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే టెట్ మార్కుల అప్‌లోడింగ్, సవరణకు విద్యాశాఖ అవకాశమివ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగుచూశాయి. సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్‌లోడ్ చేసినా పాతవే ప్రత్యక్ష్యమవడంతో గందరగోళంలో పడ్డారు. ఒక సబ్జెక్టుకు పరీక్షరాస్తే మరో సబ్జెక్టు వెబ్‌సైట్‌లో చూపించడం వంటి పొరబాట్లు తలెత్తాయి. ఇక డీఎస్సీ తుది ఆన్సర్ కీపై వచ్చిన అభ్యంతరాలపై ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టుగా సమాచారం. అయితే దీనిపై ముందుకెళ్లాలా.. లేదా ఇప్పటికే ప్రకటించిన తుది ‘కీ’ ప్రకారమే ఫలితాలు వెల్లడించాలా అనే విషయంలో విద్యాశాఖ ఎటూ తేల్చడం లేదు. దీంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.
డీఎల్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ ఫలితాలపై విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. ఫైనల్ ‘కీ’ విడుదల చేసి 20 రోజులుదాటినా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయకపోవడం ఆందోళనకర మన్నారు. ఫైనల్ ‘కీ’ తప్పులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనలో చెందుతున్నట్లు తెలిపారు. వెంటనే జీఆర్‌ఎల్‌ను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.