TG EAPCET 2026 Counselling: ఈసారి ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ మరింత ఆలస్యం.. అదే కారణమా?

TG EAPCET 2026 Counselling Schedule: రాష్ట్ర ఈఏపీసెట్‌ 2026 ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదమే ఇందుకు కారణం. సాధారణంగా ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలవ్వగానే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడులవుతుంది..

TG EAPCET 2026 Counselling: ఈసారి ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ మరింత ఆలస్యం.. అదే కారణమా?
TG EAPCET Engineering Counselling

Updated on: May 21, 2026 | 6:42 AM

హైదరాబాద్‌, మే 21: గత పదేళ్లలో జూన్, జూలైలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం ముగించారు. ఇందుకు దాదాపు నెల రోజుల ముందే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తూ వచ్చారు. కానీ ఈ ఏడాది నీట్‌ పేపర్‌ లీక్‌ కారణంగా అగ్రి, ఫార్మా కౌన్సెలింగ్‌ ఆలస్య మవుతుండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కారణంగా ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ కూడా మరికాస్త ఆలస్యం కానుంది.

కాగా ఈ ఏడాదికి తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు గత ఆదివారం (మే 17) విడుదలయ్యాయి. ఆన్‌లైన్‌ పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు కంప్యూటర్‌ తెరపై కనిపించే ఏర్పాట్లూ ఈ ఏడాది నుంచే మొదలు పెట్టారు. దీంతో ఎవరి ఏయే ర్యాంకులు వస్తాయో తెలిశాయి. దీని ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందనే అంచనాకు కూడా విద్యార్థులు వచ్చారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

తేలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదం

ఫీజు రీయింబర్స్‌పై గత ఏడాది నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. బకాయిలతోపాటు ప్రతీ యేటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో చెల్లించాలని ప్రైవేట్‌ కాలేజీలు కోరుతున్నాయి. దీనిపై ప్రైవేట్‌ కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. ఇక నుంచి తప్పకుండా చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ ఏ గడువులోగా చెల్లిస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ అంశం ఇప్పటికీ కోర్టు ముందు ఉంది. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థులకే నేరుగా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ప్రైవేటు కాలేజీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే వరకూ నిరీక్షిస్తే కాలేజీల నిర్వహణ కష్టమవుతుందని, ఒకవేళ విద్యార్థి ఖాతాలో ఫీజులు వేసినా, కాలేజీలకు సకాలంలో చెల్లించకుండా, ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఉందని ప్రశ్నిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌ ఆలస్యమైతే కాలేజీలు విద్యార్థులను ఫీజులు కట్టమని ఒత్తిడి తెస్తాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించకుండా ఉన్నత విద్యామండలి జాప్యం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వ వర్గాలతో చర్చించిన అనంతరం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

Follow Us