CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తీపి కబురు ఇచ్చారు. పోలీసు నియామక పరీక్ష కటాఫ్ మార్కులను తగ్గిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని సీఎం ప్రకటించారు. ఈ విషయమై అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కటాఫ్ మార్కులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖలో మొత్తం 15,644 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 28న నిర్వహించారు. అనంతరం కీ పేపర్‌ను విడుదల చేశారు. అయితే 5 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు తప్పుగా ఉన్నాయని వాదనలు వినిపించాయి. దీంతో అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు త్వరలోనే తుది ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఇంతలోపే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆందోళనలు మొదలు పెట్టారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..