
కెనడాలోని టొరంటోలో ఓ రోజు.. 24 ఏళ్ల ప్రేమ్ వత్సా ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకు హడావుడిగా వెళ్తున్నారు. ఇంటర్వ్యూకు ఇంకా 20 నిమిషాల సమయం మాత్రమే ఉంది. చేతిలో ఫైల్ పట్టుకుని వేగంగా నడుస్తున్న ఆయనకు.. అకస్మాత్తుగా ‘దొంగ.. పారిపోతున్నాడు.. పట్టుకోండి’ అంటూ కేకలు వినిపించాయి. ఆ మాటలు తనను ఉద్దేశించినవని తెలుసుకునేలోపే పోలీసులు అతడిని పట్టుకున్నారు. బేడీలు వేసి, తుపాకీ గురిపెట్టి ప్రశ్నించారు. వీధి చివర్లోని ఓ బ్యాంకులో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడిగా ప్రేమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అసలు విషయం బయటపడింది. ప్రేమ్ దొంగ కాదని నిర్ధారణ కావడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అయితే అప్పటికే ఇంటర్వ్యూ సమయం దాటిపోయింది. ఉద్యోగం కోల్పోతానన్న బాధతో అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. అయినా ప్రేమ్ వెనక్కి తగ్గలేదు. ఆలస్యమైనా ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకుని జరిగిన విషయాన్ని అధికారులకు వివరించారు. అంత ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం ఇంటర్వ్యూ నిర్వహించిన వారికి నచ్చింది. అదే అతడికి కొత్త జీవితానికి తలుపులు తెరిచింది.
ప్రేమ్ వత్సా హైదరాబాద్‌లోనే పెరిగారు. ఆయన తండ్రి మనోహర్ వత్సా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలు ఎదుర్కొని చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. తండ్రి స్ఫూర్తితో ప్రేమ్ ఐఐటీ మద్రాస్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లినప్పుడు మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. అప్పటి నిబంధనల కారణంగా భారత్ నుంచి కెనడాకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో.. అక్కడి చదువుల ఖర్చుల కోసం ప్రేమ్ ఎన్నో కష్టాలు పడ్డారు. రాత్రుళ్లు పస్తులుండాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. పగటిపూట ఇంటింటికీ తిరుగుతూ ఏసీలు, ఫర్నేస్‌లు విక్రయిస్తూ డబ్బు సంపాదించేవారు. వలసదారుల పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా కొందరు ఆయనతో అవమానకరంగా ప్రవర్తించేవారు. ‘మాకున్న సేల్స్‌మ్యాన్ ఉద్యోగాలను కూడా మీరే తీసుకుంటారా?’ అంటూ కొందరు ముఖం మీదే తలుపులు మూసేవారు. అయినా ప్రేమ్ నిరాశ చెందలేదు.
ఒకరోజు ఇంటింటికీ తిరుగుతూ చివరి ప్రయత్నంగా ఓ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ ఇంటి తలుపు తట్టారు. ఆ వ్యక్తికి ప్రేమ్‌లో సాధారణ సేల్స్‌మ్యాన్ కనిపించలేదు. అతడిలో ఉన్న తెలివితేటలు, ఆలోచనా విధానం గుర్తించారు. ‘మా కంపెనీలో ఖాళీలు ఉన్నాయి. రేపు ఇంటర్వ్యూకు రా’ అంటూ అవకాశం ఇచ్చారు. అదే కాన్ఫెడరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ప్రేమ్ వత్సా కెరీర్‌కు శ్రీకారం చుట్టింది. అయితే అక్కడికి చేరుకోవడానికి ముందే ఎదురైన అరెస్ట్ ఘటన ఆయన జీవితంలో మరో కీలక మలుపుగా మారింది.
ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రేమ్ వత్సాకు ఆయన బాస్ ఓ కీలక సలహా ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ ఏటా రాసే వార్షిక నివేదికలను చదవాలని సూచించారు. ఆ సలహా ప్రేమ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఇన్సూరెన్స్ కంపెనీల డబ్బును పెట్టుబడులుగా మలుచుకుంటూ వారెన్ బఫెట్ బిలియనీర్‌గా ఎదిగిన తీరు ప్రేమ్‌కు స్ఫూర్తినిచ్చింది. తాను కూడా అలాంటి స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి పెట్టుబడులు, కంపెనీల పనితీరు, ఆర్థిక మార్కెట్లను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. క్రమంగా ఆయన కెరీర్‌లో ఎదుగుతూ కేవలం తొమ్మిదేళ్లలోనే అదే సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.
కెరీర్‌లో పదో సంవత్సరంలో ప్రేమ్ వత్సా కీలక నిర్ణయం తీసుకున్నారు. దివాలా అంచున ఉన్న ఓ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసి దానికి Fairfax Financial Holdings అనే పేరు పెట్టారు. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో వచ్చే పరిణామాలను ముందుగానే అంచనా వేయడంలో ప్రేమ్ నైపుణ్యం సంపాదించారు. ఈ దూరదృష్టి ఆయనకు భారీ విజయాలను అందించింది. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చిన సమయంలోనూ ముందస్తు అంచనాలతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో Fairfax సంస్థను గట్టెక్కించగలిగారు. ఆ తర్వాత సంస్థ మరింత బలపడటంతో ప్రేమ్ వత్సాకు ‘కెనడా వారెన్ బఫెట్’ అనే పేరు వచ్చింది. ఫెయిర్‌ఫ్యాక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టిన ప్రేమ్ వత్సా.. భారత్‌లోనూ పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. బెంగళూరు విమానాశ్రయం, సీఎస్‌బీ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్ వంటి సంస్థల్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయి. అలా వివిధ దేశాలు, రంగాల్లో పెట్టుబడులు పెడుతూ Fairfax సంస్థను భారీ స్థాయికి తీసుకెళ్లారు.
ఆర్థిక విజయాలతో పాటు సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ప్రేమ్ వత్సా సేవా కార్యక్రమాలపైనా దృష్టి పెట్టారు. తాను చదువుకున్న ఐఐటీ మద్రాస్‌లోని సుధాగోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్‌కు రూ.41 కోట్ల విరాళం అందించారు. అలాగే Fairfax India Charitable Foundationను స్థాపించి, దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన కిడ్నీ రోగులకు డయాలసిస్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. జీవితంలో ఎదురైన ప్రతి అవమానాన్ని ప్రేమ్ వత్సా ఓ పాఠంగా తీసుకున్నారు. ఇంటింటికీ తిరిగి వస్తువులు అమ్మిన రోజులు.. ముఖం మీద తలుపులు మూసిన సందర్భాలు.. ఉద్యోగాల్లో ఎదురైన రిజెక్షన్లు.. చేయని నేరానికి దొంగగా అరెస్టైన ఘటన.. ఇవేవీ ఆయన లక్ష్యాన్ని మార్చలేకపోయాయి. ఒకప్పుడు అవకాశాల కోసం తలుపులు తట్టిన యువకుడే.. తర్వాత వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా.. వాటినే అవకాశాలుగా మార్చుకుంటే విజయం తప్పక సాధ్యమేనని ప్రేమ్ వత్సా జీవితం చెబుతోంది.