
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనుంది. అత్యధికంగా ముంబయిలో 249 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఫిబ్రవరి 16, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 8, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్ రాత పరీక్షలు, భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.58,514 జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు అందిస్తారు.
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.