అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!

Twin students same marks: తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన కవల బాలికలు సెంథమిల్కావియా, పాయంతమిళ్ ఓవియా పదో తరగతి ప్రభుత్వ పబ్లిక్ పరీక్షల్లో అచ్చం ఒకేలా 420 మార్కులు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ చూపుతున్న ఈ కవలలు ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
Twin Students Same Marks

Updated on: May 21, 2026 | 8:15 PM

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా పరిధిలోని ఆరూర్ సమీప గ్రామమైన పొయ్యపట్టి గ్రామంకు చెందిన కృష్ణన్–కలైయరసి దంపతుల కవల కుమార్తెలు సెంథమిల్కావియా, పాయంతమిళ్ ఓవియా తమ ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 2011లో జన్మించిన ఈ కవల బాలికలు చిన్ననాటి నుంచే చదువులో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. తాజాగా నిర్వహించిన 10వ తరగతి ప్రభుత్వ పబ్లిక్ పరీక్షల్లో ఇద్దరూ ఒకేలా 420 మార్కులు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు.

ప్రత్యేకత ఏమిటంటే, మొత్తం మార్కులు ఒకేలా వచ్చినప్పటికీ, ప్రతి విషయంలో వారు సాధించిన మార్కులు భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. సెంథమిల్కావియా తమిళంలో 94, ఆంగ్లంలో 77, గణితంలో 75, సైన్స్‌లో 82, సామాజిక శాస్త్రంలో 92 మార్కులు సాధించి మొత్తం 420 మార్కులు పొందింది. మరోవైపు, పాయంతమిళ్ ఓవియా తమిళంలో 83, ఆంగ్లంలో 73, గణితంలో 88, సైన్స్‌లో 85, సామాజిక శాస్త్రంలో 91 మార్కులు సాధించి ఆమె కూడా మొత్తం 420 మార్కులు సాధించింది.

ఇద్దరి మార్కుల పంపిణీ వేర్వేరుగా ఉన్నప్పటికీ, తుది ఫలితంగా ఇద్దరికీ సమాన స్కోరు రావడం ఉపాధ్యాయులు, గ్రామస్థులు, బంధువులను ఆశ్చర్యానికి గురి చేసింది. కవలలుగా జన్మించిన ఈ బాలికలు చదువులోనూ ఒకే స్థాయిలో ప్రతిభ కనబరచడం విశేషంగా నిలిచింది.

గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థినుల విజయంతో వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలు సాధించగలరని ఈ కవల సోదరీమణులు నిరూపించారు. ప్రస్తుతం వీరి విజయగాథ స్థానికంగా చర్చనీయాంశంగా మారి, ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణగా నిలుస్తోంది.

Follow Us