Inter English Question Paper: ఇంటర్‌ ఇంగ్లిష్‌ క్వశ్చన్‌ పేపర్‌లో తప్పులు.. మార్కులు కలపాల్సిందేనంటూ తల్లిదండ్రుల డిమాండ్!

ఏపీలో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షల్లో వరుసగా తప్పులు దొర్లడం విద్యార్దులతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 1వ తేదీన జరిగిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తెలుగు ప్రశ్నపత్రంలోనూ తప్పులు దొర్లాయి. ఇక మార్చి 5వ తేదీన సెకండ్ ఇయర్‌ ఇంగ్లిష్‌ పేపర్‌లో మారోమారు ప్రశ్నపత్రంలో ప్రింటింగ్‌ సరిగ్గాలేనందున రెండు ప్రశ్నల్లో తప్పులు కనిపించాయి..

Inter English Question Paper: ఇంటర్‌ ఇంగ్లిష్‌ క్వశ్చన్‌ పేపర్‌లో తప్పులు.. మార్కులు కలపాల్సిందేనంటూ తల్లిదండ్రుల డిమాండ్!
Errors In Inter English Question Paper

Updated on: Mar 06, 2025 | 3:59 PM

అమరావతి, మార్చి 6: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో మార్చి 1 నుంచే పరీక్షలు ప్రారంభమవగా.. తెలంగాణలో మాత్రం మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఏపీలో మార్చి 5వ తేదీన జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ 2 పరీక్ష ప్రశ్నాపత్రంలో ప్రింటింగ్‌ మిస్టేక్స్‌ వల్ల అక్షరాలు కనిపించక రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లోని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఐదు మార్కులకు సంబంధించిన 8, 13 ప్రశ్నలు క్వశ్చన్‌ పేపర్లలో సరిగ్గా ముద్రణ జరగలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇంటర్‌ బోర్డు అధికారుల సూచన మేరకు ప్రింటింగ్‌ సరిగ్గా ఉన్న ప్రశ్నపత్రాల నుంచి ఆ రెండు ప్రశ్నలను వేరుగా జిరాక్స్‌ తీసి ఒకరి తర్వాత మరొకరు మార్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మరికొన్ని చోట్ల ఆ ప్రశ్నలను బ్లాక్‌ బోర్డులపై రాయగా.. ఇంకొన్ని చోట్ల వైట్‌ పేపర్లపై వాటిని రాసి విద్యార్ధులకు పంపిణీ చేశారు.

కాగా ఏపీలో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షల్లో వరుసగా తప్పులు దొర్లడం విద్యార్దులతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 1వ తేదీన జరిగిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తెలుగు ప్రశ్నపత్రంలోనూ తప్పులు దొర్లాయి. ఇక మార్చి 5వ తేదీన సెకండ్ ఇయర్‌ ఇంగ్లిష్‌ పేపర్‌లో మారోమారు ప్రశ్నపత్రంలో ప్రింటింగ్‌ సరిగ్గాలేనందున రెండు ప్రశ్నలకు తప్పులు కనిపించాయి. డయాగ్రాం ఆధారంగా ఇచ్చిన రెండు ఐదు మార్కుల ప్రశ్నలకు డయాగ్రాంలు సరిగా ప్రింట్‌ కాలేదు. డయాగ్రాంలలో ఇచ్చిన అంకెలు, పదాలు మసకగా కనిపించాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పరీక్ష మొదలైన 25 నిమిషాలకే ఈ సమస్య వెలుగులోకి రావడంతో ఇంటర్‌ బోర్డు అధికారులు వెంటనే స్పందించి విద్యార్ధులకు ఆయా ప్రశ్నల్లో కనిపించని అంకెలు, పదాలను ఇన్విజిలేటర్ల ద్వారా తెలియజేశారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యమే ఈ తప్పిదాలకు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లీషు పేపర్‌లో వచ్చిన తప్పులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తప్పు వచ్చిన రెండు ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ (PAAP) డిమాండ్‌ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా నివారించాలని, విద్యార్థులకు ఒత్తిడి లేని పరీక్షా వాతావరణాన్ని కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్‌ను కోరుతున్నట్లు PAAP లేఖను సమర్పించారు.

అయితే పరీక్షలో విద్యార్థులు 25 నిమిషాలు కోల్పోయారనే వాదనను ఇంటర్‌ బోర్డు అధికారులు ఖండించారు. ఆ పరీక్ష రోజు ఉదయం 9 గంటల వరకు తనతో సహా ఎవరికీ ప్రశ్నాపత్రం అందుబాటులో లేదని ఇంటర్మీడియట్ పరీక్షల కంట్రోలర్ వివి సుబ్బారావు స్పష్టం చేశారు. పంపిణీ చేసిన వెంటనే నలుగురు సభ్యుల నిపుణుల బృందం ప్రశ్నాపత్రాన్ని సమీక్షించి, లోపాలు, దిద్దుబాటు సూచనలు అన్ని కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవచ్చని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.