AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. టెన్త్ అర్హతతో నెలకు రూ. లక్షకుపైగా జీతం!

రైల్వే రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) తీపికబురు చెప్పింది. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 237 పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిగ్నలింగ్ అండ్ టెలికాం, రోలింగ్ స్టాక్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్ధులకు దేశంలోని హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక బాధ్యతలను నిర్వహించే అవకాశం అభ్యర్థులకు లభించనుంది.

NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. టెన్త్ అర్హతతో నెలకు రూ. లక్షకుపైగా జీతం!
NHSRCL Bullet Train Project Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 23, 2026 | 1:34 PM

Share

బుల్లెట్ ట్రైన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫిట్టర్, మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సర్వేయర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, మెషినిస్ట్, టర్నర్ తదితర ట్రేడ్లలో ఐటీఐ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి బ్రాంచ్‌లలో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 2026 జూన్ 30 నాటికి కనీసం రెండేళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ వర్గాలకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో 5 ఆగస్టు, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద యూఆర్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు రూ.400 తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అయితే బీఈ/బీటెక్ వంటి ఉన్నత విద్యార్హతలు మాత్రమే ఉండి, ఐటీఐ లేదా డిప్లొమా అర్హత లేని వారు దరఖాస్తుకు అనర్హులు. బోధన, ఫ్యాకల్టీ, అప్రెంటిస్‌షిప్, పార్ట్‌నర్‌షిప్, ఫ్రీలాన్సింగ్ అనుభవాలను ఉద్యోగ అనుభవ ఉన్నా పరిగణించరు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

సీబీటీలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. సీబీటీ తేదీలు, ఇతర వివరాలను అభ్యర్థుల ఈమెయిల్‌కు పంపిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 నుంచి రూ.1,10,000 వరకు వేతనంగా అందించనున్నారు. అదనంగా ఐడీఏ, హెచ్‌ఆర్‌ఏ, పెర్క్స్, వైద్య సదుపాయాలు, ఈపీఎఫ్, గ్రాట్యుటీతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది. నియామకం అనంతరం ఒక సంవత్సరం ప్రొబేషన్ కాలం ఉంటుంది.

NHSRCLలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us