Inspirational Story: కొడుకు కోసం క్లాస్‌మేట్‌గా మారిన తల్లి.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు కొన్ని నెలల ముందు ఎదురైన తీవ్రమైన ఆరోగ్య సమస్య సాధారణంగా ఏ విద్యార్థి కలలనైనా ఛిద్రం చేస్తుంది. కానీ బీహార్‌కు చెందిన గుంజన్ కుమార్ విషయంలో మాత్రం అది జరగలేదు. మూడు నెలల పాటు మంచానికే పరిమితమైనప్పటికీ, తల్లి అండతో చదువును కొనసాగించి చివరకు ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ సీటు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని కథ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Inspirational Story: కొడుకు కోసం క్లాస్‌మేట్‌గా మారిన తల్లి.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం
IIT Topper Gunjan Kumar Success Story

Updated on: Jul 08, 2026 | 5:41 PM

బీహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన గుంజన్ కుమార్ అనే విద్యార్ధి జేఈఈ ప్రయాణం అంత సజావుగా సాగలేదు. జేఈఈ 2021 టాపర్ మృదుల్ అగర్వాల్ విజయంతో ప్రేరణ పొంది 2023లో కోటాకు వెళ్లి జేఈఈ సన్నాహకాలు ప్రారంభించాడు. అయితే 2025 అక్టోబర్‌లో అనుకోకుండా న్యూమోథోరాక్స్ అనే వ్యాధి బారీనపడ్డాడు. ఈ వ్యాధి వల్ల గుంజన్‌ ఊపిరితిత్తి కుంచించుకుపోవడంతో అతను దాదాపు మూడు నెలల పాటు పూర్తిగా బెడ్‌రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో కోచింగ్ తరగతులకు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. అలాంటి క్లిష్ట సమయంలో గుంజన్ తల్లి గుంజా తన కుమారుడి కల ఆగిపోకూడదని నిర్ణయించుకుంది. బీఎడ్ పట్టభద్రురాలైన ఆమె గుంజన్‌తో కలిసి ఆన్‌లైన్ తరగతులు వింటూ ప్రతి లెక్చర్‌కు సంబంధించిన నోట్స్‌ను స్వయంగా సిద్ధం చేసింది. ఆమె రాసిన నోట్స్ గుంజన్ చదువుకు పెద్ద బలంగా మారాయి. అనారోగ్యం కారణంగా తరగతులకు వెళ్లలేకపోయినా, చదువులో వెనుకబడకుండా ఉండేందుకు అవే తోడ్పడ్డాయి.

గుంజన్‌కు అనారోగ్యమే కాకుండా మరో సవాలు కూడా ఉంది. అతనికి 70 శాతానికి పైగా దృష్టి లోపం ఉంది. 9.5 పవర్ ఉన్న కళ్లద్దాలు ఉపయోగించాల్సి వస్తుంది. అయినప్పటికీ ఈ శారీరక సమస్యలు తన లక్ష్యాన్ని దెబ్బతీయనివ్వలేదు. కష్టాలను అధిగమిస్తూ జేఈఈ మెయిన్‌లో 91.8 పర్సెంటైల్ సాధించాడు. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పీడబ్ల్యూడీ-ఓబీసీ విభాగంలో 50వ ర్యాంక్, కామన్ పీడబ్ల్యూడీ విభాగంలో 120వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అంతే.. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో ప్రవేశం పొందాడు. తన విజయంపై స్పందించిన గుంజన్.. జీవితంలో ఎప్పుడూ అనుకూల పరిస్థితులు ఉండవు. కానీ ధైర్యం, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని చెప్పాడు. తన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కూడా విజయానికి ఎంతో దోహదపడిందని పేర్కొన్నాడు.

గుంజన్ తల్లి గుంజా మాట్లాడుతూ.. తన కుమారుడి కలే తన కలగా మారిందని తెలిపింది. అనారోగ్యం కారణంగా చదువుకు ఆటంకం ఏర్పడినప్పుడు, అతనితో కలిసి చదవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తాను సిద్ధం చేసిన నోట్స్ అతడి విజయానికి ఉపయోగపడటం ఆనందంగా ఉందని పేర్కొంది. గుంజన్ తండ్రి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, అతని తమ్ముడు కూడా ప్రస్తుతం కోటాలో జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. గుంజన్ విజయగాథ విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల మద్దతు, ఉపాధ్యాయుల సహకారం కలిసి ఉంటే ఎంతటి సవాళ్లనైనా జయించవచ్చని నిరూపిస్తోంది.

Follow Us