
ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే సమయంలో రెజ్యూమ్ కచ్చితంగా ఉండాలనే విషయం తెలిసిందే. వ్యక్తిగత వివరాలతో పాటు అంతకు ముందు చేసిన ఉద్యోగానికి సంబంధించిన వివరాలను రెజ్యూమ్‌లో పేర్కొంటాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి రెజ్యూమ్ చూడడం ద్వారానే మీపై ఒక అభిప్రాయానికి వచ్చేస్తారనే విషయం మీకు తెలుసా.? అవును అందుకే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఇంతకీ రెజ్యుమ్ ప్రిపేర్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి తప్పులు చేయడం వల్ల రెజ్యూమ్ రిజక్ట్ అయ్యే అవకాశాలుంటాయి లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..
రెజ్యూమ్‌లో వ్యక్తిగత సమాచారాన్ని కొంతమేర మాత్రమే ఇవ్వాలి. మీరు సాధించిన విజయాలను కేవలం కొన్ని పదాల్లోనే రెజ్యూమ్‌లో ప్రస్తావించాలి. మీ హాబీలను పూర్తి వివరణాత్మక సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక రెజ్యూమ్‌లో ఎక్కువగా సమాచారాన్ని కూడా అందించకండి. మీ రెజ్యూమ్ చూసే వ్యక్తి విసుగు చెందే అవకాశం ఉంటుంది. రెజ్యూమ్‌లో పేర్కొన్న అంశాలను సూటిగా, సుత్తిలేకుండా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇక మీ రెజ్యూమ్‌లో అంతకు ముందు పనిచేసిన సంస్థ గురించి పెద్దగా ప్రస్తావించకపోవడమే మంచిది. కొందరు పాత ఉద్యోగాన్ని వదిలేయడానికి గల కారణాలను వివరిస్తుంటారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు. మీ రెజ్యూమ్‌లో పాత కంపెనీ యాజమాన్యం గురించి నెగిటివ్ విషయాలను ప్రస్తావించకండి. ఇది మీపై ప్రస్తుత కంపెనీకి మీపై నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు పాత కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించే ప్రస్తావించాలి కానీ, నెగిటివ్ విషయాల జోలికి వెల్లకపోవడమే మంచిది. ఇక రెజ్యూమ్ ఫాంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వివిధ రకాల ఫాంట్‌లను ఉపయోగించం, కలర్స్, టేబుల్స్ వంటివి లేకుండా చూసుకోండి. ఇక వీలైనంత వరకు రెజ్యూమ్‌లో భాష కూడా సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. మరీ క్లిష్టమైన పదాలను ఉపయోగించకపోవడమే మంచిది. గ్రామర్‌లో మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఇక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. దీనివల్ల మీపై ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. ఇక గతంలో సాధించిన విజయాలను ప్రస్తావించాలి. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీని ఒకటికి రెండు సార్లు చెక్ చేసకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ఎలాగైనా ఉద్యోగం పొందాలని రెజ్యూమ్‌లో అబద్ధాలను ప్రస్తావించకూడదు. నిజాయితీగా వివరాలను అందించాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..