
బెంగళూరు, జనవరి 18: కర్ణాటకలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు యేటా అందించే షూ, సాక్స్ పంపిణీ పథకంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా విద్యా శాఖ కొన్ని జిల్లాల్లో విద్యార్ధులకు అందించే బూట్లకు బదులుగా చెప్పులు పంపిణీ చేయాలని భావించింది . వర్షాకాలం, వేసవిలో విద్యార్థులు ఎక్కువసేపు బూట్లు ధరించడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ వాతావరణానికి అనుగుణంగా పాదరక్షలను అందించడానికి విద్యాశాఖ చర్యలు తీసుకుంది.
ఎక్కువసేపు బూట్లు ధరించడం వల్ల పాదాలలో చెమట పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే వర్షాకాలంలో సాక్స్, బూట్లు తడిసిపోతే వాటిని ఆరబెట్టడం కష్టమవుతుంది. దీనివల్ల దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వేసవి ఎండలో, వర్షాకాలంలో బురదలో బూట్లు ధరించడం కంటే చెప్పులు ధరించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు చెప్పులు ఇవ్వాలనే ఆలోచనను పరిశీలిస్తున్నారు.
ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందు ఏ జిల్లాల్లో షూ ధరించడం ఎక్కువగా ఉందో సమాచారం సేకరించాలని విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్లను ఆదేశించింది. ముఖ్యంగా ఉర్దూ డైరెక్టరేట్, ఇతర మైనారిటీ భాషా పాఠశాలలు ఈ విషయంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. షూ ధరించడం కష్టంగా ఉన్న జిల్లాల జాబితా ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని వర్గాలు తెలిపాయి.
విద్యార్థులకు బూట్లకు బదులుగా చెప్పులు అందించాలనే ప్రతిపాదన కొత్తది కాదు. 2015లో కూడా ఇలాంటి పథకాన్ని ప్లాన్ చేశారు. కానీ వివిధ సాంకేతిక, పరిపాలనా కారణాల వల్ల ఆ పథకాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత ‘చప్పలి భాగ్య’ పథకం మళ్ళీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లను అందిస్తున్నారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.265, 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు రూ.295, 9 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.325 చొప్పున ధర నిర్ణయించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.