Holiday Perks: ఏ ఉద్యోగంలో ఎక్కువ సెలవులు దొరుకుతాయ్? ఆ విషయం తెలిస్తే, మీరు అక్కడే పని చేయడానికి ఇష్టపడతారు!
ఉరుకులు పరుగుల జీవితంలో మంచి జీతంతో పాటు తగినంత విశ్రాంతినిచ్చే ఉద్యోగాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. కార్పొరేట్ రంగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, యువత పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) ఏడాది పొడవునా లభించే సెలవులను పరిగణనలోకి తీసుకుని వృత్తిని ఎంచుకుంటున్నారు. భారత్‌లో ఉపాధ్యాయ వృత్తి, న్యాయవ్యవస్థ, రక్షణ రంగాలు, ప్రభుత్వ సర్వీసుల్లో లభించే సెలవుల గురించి తెలుసుకుందాం.

మంచి ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, కుటుంబంతో గడపడానికి వ్యక్తిగత విశ్రాంతికి తగిన సమయం ఉండాలి. అయితే ప్రస్తుత కాలంలో చాలా రంగాల్లో వారానికి ఒక సెలవు దొరకడమే గగనంగా మారింది. చాలా వృత్తుల్లో సెలవులు కలగా మారినప్పటికీ, కొన్ని రంగాల్లో చాలా సెలవులు దొరుకుతాయి. ఆ రంగాలేమిటో తెలుసుకుందాం.
1. విద్యా రంగం లేదా బోధనా వృత్తి: సెలవుల విషయంలో ఉపాధ్యాయులు అదృష్టవంతులు. పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకుల పనివేళలు విద్యార్థులతో నేరుగా ముడిపడి ఉండటం వల్ల, సెలవుల విషయంలో ఈ రంగం టాప్‌లో ఉంటుంది. ఉపాధ్యాయులకు సంవత్సరానికి రెండుసార్లు సుదీర్ఘమైన సెలవులు లభిస్తాయి. వేసవి సెలవులు సుమారు ఒకటి నుండి ఒకటిన్నర నెలల వరకు ఉంటాయి. వీటితో పాటు 10 నుండి 15 రోజుల దసరా లేదా మధ్యంతర సెలవులు, అన్ని జాతీయ, మతపరమైన పండుగ సెలవులు పాఠశాలలకు వర్తిస్తాయి.
2. భారత న్యాయవ్యవస్థ: భారత ఉన్నత న్యాయవ్యవస్థలో బ్రిటీష్ కాలం నాటి ‘సెలవు’ నిబంధనల ప్రకారం సుదీర్ఘమైన విరామాలు ఉంటాయి. వేసవి కాలంలో సుమారు నాలుగు నుండి ఆరు వారాల పాటు కోర్టులు పూర్తిగా మూసేస్తారు. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో శీతాకాలం, శరదృతువు విరామాలు మంజూరు చేస్తారు. అత్యవసర కేసుల కోసం వెకేషన్ బెంచ్‌లు పనిచేసినప్పటికీ, సాధారణ సిబ్బందికి, న్యాయమూర్తులకు ఇది విశ్రాంతిదాయకమైన సమయం.
3. రక్షణ సేవలు… కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళ సైనికులకు ప్రభుత్వం తగిన విశ్రాంతిని కల్పిస్తుంది. వీరికి సంవత్సరానికి 60 రోజుల వార్షిక సెలవు 20 రోజుల సాధారణ సెలవు, మొత్తంగా 80 రోజుల సెలవులు అందుబాటులో ఉంటాయి. సరిహద్దుల్లో మోహరించిన సైనికులు తమ రెండు లేదా మూడు నెలల సెలవును ఒకేసారి ‘క్లబ్బింగ్’ చేసి ఇంటికి వెళ్లే వెసులుబాటును పొందుతారు.
4. సివిల్ సర్వీసులు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులకు స్థిరమైన సెలవుల సౌకర్యం ఉంటుంది. చాలా కేంద్ర శాఖలలో ‘ఐదు రోజుల పని వారం’ ఉండటం వల్ల, ఏడాదికి 52 శనివారాలు 52 ఆదివారాలతో మొత్తం 104 రోజులు స్థిరమైన సెలవులు లభిస్తాయి. వీటితో పాటు ప్రతి సంవత్సరం 30 ఆర్జిత సెలవులు (EL), 8 సాధారణ సెలవులు (CL), 20 వైద్య సెలవులు అందుబాటులో ఉంటాయి. అలాగే మహిళా ఉద్యోగులకు 6 నెలల ప్రసూతి సెలవు పురుషులకు 15 రోజుల పితృత్వ సెలవు అర్హత ఉంటుంది.
