పేదింటి బిడ్డలకు పెద్ద చదువుల ఛాన్స్.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు 2027 నోటిఫికేషన్! సీటొస్తే అన్నీ ఫ్రీ

JNVST 6th Class Admissions 2027: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST 2027) ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు జులై 31, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

పేదింటి బిడ్డలకు పెద్ద చదువుల ఛాన్స్.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు 2027 నోటిఫికేషన్! సీటొస్తే అన్నీ ఫ్రీ
Navodaya Vidyalaya Admission Process Begins

Updated on: Jul 08, 2026 | 8:18 PM

దేశవ్యాప్తంగా జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST 2027) ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయిస్తారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మొత్తం 665 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 15 జేఎన్‌వీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు జులై 31, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యేటా నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. నవోదయాల్లో బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.

జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2027కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. అలాగే 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు మాత్రమే కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. విద్యార్ధుల వయసు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2015 నుంచి జులై 31, 2017 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు జులై 31 ముగింపు సమయంలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. నవంబరు 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి 2027 చివరి వారంలో వెలువడే అవకాశం ఉంది.

ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే..

జవహర్‌ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ ఎన్నిరాన్మెంటల్‌ స్టడీస్‌, అరిథ్‌మెటిక్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌ విభాగాల నుంచి 80 ప్రశ్నలు 100 మార్కులకు వస్తాయి. 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us