హైదరాబాద్, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తు గడువు నేటి (సెప్టెంబర్ 23)తో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం తొలుత సెప్టెంబర్ 16వ తేదీనే దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ.. తాజాగా దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఈ రోజు దరఖాస్తు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు సంబంధిత జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి నెలలో వెల్లడి చేస్తారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి వసతి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. అలాగే విద్యార్థుల వయసు మే 01, 2013 నుంచి జులై 31, 2015 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ పీజీఈసీ/ పీజీఈసెట్ 2024 రెండో విడత కౌన్సెలింగ్ సోమవారం (సెప్టెంబర్ 23) ప్రారంభమైంది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 27 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29, 30వ తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 1న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 5న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 7 నుంచి 10వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టుతో పాటు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలి. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ పీజీఈసెట్ 2024 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.