
జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ పరీక్షలు జనవరి 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఇటీవల ఏన్టీయే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్‌లో జనవరి 23న సరస్వతి పూజ హాలిడే ఉంది. ఈ పండగ ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకం. అందువల్ల ఇదే రోజున పరీక్ష ఉండటంతో JEE మెయిన్ 2026 (సెషన్-1) పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పూజ రోజున కూడా పరీక్ష ఉండటం వల్ల విద్యార్థులు తమ మత ఆచారాలు, పరీక్ష ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.
ఈ క్రమంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 23న పశ్చిమ బెంగాల్‌లో జరిగే JEE మెయిన్ 2026 పరీక్షను వాయిదా వేసింది. ఈ రోజున పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులకు పరీక్ష రాయడానికి మరో తేదీని కేటాయిచారు. దీంతో సరస్వతి పూజ రోజున పశ్చిమ బెంగాల్ విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాయవల్సిన అవసరం లేదన్నమాట. మరోవైపు ఎన్టీయే ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను కూడా విడుదల చేసింది. సిటీ స్లిప్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. పరీక్ష తేదీలు సమీపిస్తుండటంతో అడ్మిట్ కార్డులు ఏ క్షణమైనా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆయా పరీక్షలకు హల్ టిక్కెట్లు పరీక్షకు 3 నుంచి 4 రోజుల ముందు అంటే జనవరి 17 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అకాశం ఉంటుంది.
సరస్వతి పూజ పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, వారికి ఇదొక భావోద్వేగ పండుగ కూడా. ఈ రోజున విద్యార్థులు చదువులు తల్లి సరస్వతిని పూజిస్తారు. తమ కలల కోసం ఆశీర్వాదం తీసుకుంటారు. సరిగ్గా అదే రోజున పెద్ద పోటీ పరీక్ష ఉండటం వల్ల విద్యార్థుల్లో కోపం, ఒత్తిడి రెండూ కనిపిస్తాయి. దీంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఈ విషయంపై ఆందోళన చేపట్టారు. దీంతో NTAని పరీక్ష తేదీని మారుస్తూ ప్రకటన వెలువరించింది.
పరీక్షా స్థాయి, పేపర్ విధానం, నియమాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని NTA స్పష్టం చేసింది. ఏ విద్యార్థికీ నష్టం జరగకుండా ఉండేందుకు పరీక్ష తేదీని మాత్రమే మారుస్తామన్నారు. కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ఉందుబాటులో ఉంచుతామని అన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.