
హైదరాబాద్, నవంబర్ 2: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2026 – 27 విద్యాసంవత్సరంలో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ (మెయిన్–2026 తొలి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రారంభించింది. నవంబర్ 27, 2025వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్టీయే వెల్లడించింది. ఆయా తేదీల్లో ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు జేఈఈ మెయిన్ పరీక్షలో సాధించే పర్సంటైల్ చాలా కీలకం. ఈ క్రమంలోనే ఎన్టీయే జేఈఈ మెయిన్ పరీక్షను ఏటా 2 సేషన్లలో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు హాజరు కావాలనుకున్న విద్యార్థులు 2024, 2025లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్ధులకు ఎలాంటి వయోపరిమితి ఉండదు. ఆసక్తి కలిగిన వారు నవంబర్ 27న రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల్లోగా ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు అవకాశం ఉంటుంది. ఏయే నగరాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించేదీ జనవరి మొదటి వారంలో ప్రకటించనున్నారు. పరీక్షకు వారం ముందు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలకానున్నాయి.
జేఈఈ మెయిన్ 2026 మొదటి సెషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్ పరీక్షలను మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. తెలుగు, ఇంగ్లిష్ సహా హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొదటి సెషన్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో సెషన్ పరీక్షలు కూడా రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ ర్యాంకును అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.