న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను పాత సిలబస్ ప్రకారమే నిర్వహించనున్నట్లు ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది. ఈ మేరకు క్లారిటీ ఇస్తూ తాజాగా ప్రకటన వెలువరించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 వెబ్‌సైట్‌ను కూడా ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి సిలబస్‌ను అందులో పొందుపరిచింది. జేఈఈ మెయిన్‌లో మెరిసిన తొలి 2.50 లక్షల మంది విద్యార్ధులకు మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు. కాగా జేఈఈ మెయిన్‌కు ఈసారి సిలబస్‌ను సైతం తగ్గించిన సంగతి తెలిసిందే. మూడు సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాలను ఎన్‌టీఏ తొలగించినట్లు ఇప్పటికే ప్రకటన వెలువరించింది. దీనితో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కూడా అదే సిలబస్ ఉంటుందా? లేదంటే కొత్త సిబలస్ విడుదల చేస్తారా అనే సందిగ్ధం విద్యార్ధుల్లో నెలకొంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు పాత సిలబసే ఐఐటీ మద్రాస్ వెబ్‌సైట్‌లో ఉంచిన సిలబస్‌ను బట్టి అవగతమవుతోంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 సిలబస్ కోసం క్లిక్ చేయండి.
కాగా జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 12, 2024 వ తేదీ నాటికి ముగియనున్నాయి. జేఈఈ మెయిన్ ర్యాంకులు ఏప్రిల్ 20వ తేదీన వెల్లడవుతాయని స్పష్టమవుతోంది. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటల లోపు ర్యాంకులు విడుదల చేసే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ రెండో విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది. అంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 21వ తేదీ నుంచి మొదలవుతుందన్నమాట.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.