
హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 25 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కీలక ప్రకటన వెలువరించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తన ప్రకటనలో పేర్కొంది. పరీక్ష కేంద్రాలకు చేరుకునే క్రమంలో విద్యార్ధులు వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతుంటారు. గేట్ల వద్ద అధికారులు వారిని లోనికి అనుమతించకపోవడంతో ఏడాదంతా వారు పడిన శ్రమ వృద్ధా అవుతుంది. మరికొందరు విద్యార్ధులు ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి.
దీనికి చెక్ పెట్టేందుకు ఇంటర్ బోర్డు నిబంధనలు సవరించి ఈ మేరకు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తుంది. గతేడాది కూడా పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న విద్యార్ధులకు 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చింది. దీంతో విద్యార్ధులంతా ఎలాంటి అవరోధాలు లేకుండా పరీక్షలు రాయగలిగారు. ఇదే పద్ధతిని ఈ ఏడాది కూడా అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తన ప్రకటనలో వెల్లడించింది. టైం టేబుల్ ప్రకారం ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9 గంటలలోపు చేరుకోవల్సి ఉంటుంది. అయితే ఇంటర్ బోర్డు ఇచ్చిన గ్రేస్ టైం మేరకు ఉదయం 9.05 గంటల వరకు విద్యార్ధులకు అనుమతి ఇస్తుంది. అయితే చివరి నిమిషంలో గందరగోళానికి గురికాకూడదంటే విద్యార్థులు ఉదయం 8.45 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
కాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఆయా తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌లకు కలిపి ఈ ఏడాది మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రుసుం చెల్లించారు. పరీక్షలను మొత్తం 1,495 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.