India Post Scholarship 2025: 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు..

India Post Scholarship 2025: 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
Deen Dayal SPARSH Yojana 2025 Scholarship

Updated on: Aug 22, 2025 | 4:22 PM

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 22: తపాలాశాఖ తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 21న నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బడుల్లో చదువుతున్న విద్యార్ధులు సెప్టెంబరు 13, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తపాలా బిళ్లల సేకరణ, ఫిలాటలీతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించేందుకు ఏటా తపాలాశాఖ ఎంపిక పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక ప్రక్రియ మొత్తం రెండు దశల్లో ఉంటుంది. తొలిదశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇక రెండోది ప్రాజెక్టు వర్క్‌. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో చరిత్ర, క్రీడలు, సాంఘికశాస్త్రం, సామాన్యశాస్త్రం, జనరల్‌ నాలెడ్జ్, స్టాంపులు వంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్హత సాధించినవారు 16 స్టాంపులతో 4 నుంచి 5 పేజీలకు మించకుండా ప్రాజెక్టు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత తపాలాశాఖ రీజినల్‌ ఆఫీసు చిరునామాకు తమ ప్రాజెక్టు వర్క్‌ను పోస్ట్‌ ద్వారా విద్యార్ధులు పంపాల్సి ఉంటుంది.

దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈ రెండు దశల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను విజయవాడ, హైదరాబాద్‌లోని తపాలాశాఖ సర్కిల్‌ అధికారులు ఎంపిక చేసి మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. ఇలా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఒక్కో తరగతి నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు సమీపంలోని సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.